Telugu News » Revanth Reddy : రేవంత్ అనే నేను.. ఇట్స్ అఫీషియల్

Revanth Reddy : రేవంత్ అనే నేను.. ఇట్స్ అఫీషియల్

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలలో దాదాపు 50 మంది రేవంత్ కే మొగ్గు చూపారు. వారి అభిప్రాయాలనూ హైకమాండ్ పరిశీలించి చివరకు ఫైనల్ చేసింది.

by admin
revanth-reddy-as-telangana-new-cm

ఉత్కంఠ వీడింది. ఊహించిందే నిజమైంది. తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ విజయంలో ముఖ్యుడు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది అధిష్టానం. శాఖల విషయంలో పంచాయితీలు ముగియడంతో నేతలు అందరూ ఓ తాటిపైకి వచ్చారు. దీంతో అధిష్టానం రేవంత్ రెడ్డికి సీఎం పదవిని కట్టబెట్టింది. ఈ మేరకు అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చింది.

revanth-reddy-as-telangana-new-cm

డీకే శివకుమార్, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క సహా పలువుర్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీకి పిలిపించుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశాలను చర్చించారు. వారితో ప్రత్యేకంగా కొన్ని అంశాల గురించి మాట్లాడారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలలో దాదాపు 50 మంది రేవంత్ కే మొగ్గు చూపారు. వారి అభిప్రాయాలనూ హైకమాండ్ పరిశీలించి చివరకు ఫైనల్ చేసింది.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను చూస్తున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోమవారం సమావేశమయ్యారు. ఖర్గే నివాసంలో జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇంచార్జ్ మాణిక్‌ రావు థాక్రే కూడా పాల్గొన్నారు. అరగంట పాటు వీళ్లంతా సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపిన ఏకవాక్య తీర్మానాన్ని అధిష్టానానికి డీకే అందజేశారు. సమావేశం ముగిసిన వెంటనే ఖర్గే నివాసం నుంచి రాహుల్, కేసీ వేణుగోపాల్ వెళ్లిపోయారు. ముఖ్యమంత్రిగా రేవంత్​ రెడ్డిని ఖరారు చేయాలని రాహుల్ గాంధీ సూచించారు.

సోమవారం సీఎల్పీ నేత ఎంపిక కోసం గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌ లో ఏఐసీసీ పరిశీలకుల సమక్షంలో సమావేశం జరిగింది. దాదాపు గంటపాటు ఈ మీటింగ్ కొనసాగింది. తీవ్రంగా చర్చించిన నేతలు చివరకు సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను పార్టీ హై కమాండ్‌ కు అప్పగిస్తూ అందరూ ఏకవాక్య తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టగా మాజీ మంత్రి తుమ్మల బలపర్చారు. ఎమ్మెల్యేల నిర్ణయంతో ముఖ్యమంత్రిని అధిష్టానం ఎంపిక చేసింది. మొదట్నుంచి సీఎం రేసులో ఉన్న రేవంత్ రెడ్డినే ఖరారు చేసింది.

ఆదివారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో సీపీఐతో కలిసి కాంగ్రెస్​ 65 స్థానాల్లో గెలుపును సొంతం చేసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు 60 సీట్లు ఉంటే చాలు. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం కార్యక్రమం ఉంటుందని ఎన్నికల ప్రచారంలో పలుమార్లు రేవంత్​ రెడ్డి చెప్పారు. కానీ, అంతవరకు ఆగకుండా సోమవారమే ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. కానీ, నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పంచాయితీ ఢిల్లీకి చేరింది. చివరకు హైకమాండ్ రేవంత్ ను సీఎంగా ఎన్నుకుంది. 7న ప్రమాణ స్వీకారం ఉంటుందని అంటున్నారు.

You may also like

Leave a Comment