మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) లోని హేమాహేమీలు ఓటమి పాలయ్యారు. ఆఖరికి మంత్రులకు కూడా షాకులు తప్పలేదు. అయితే.. ఓడిపోయిన నేతలు క్యాపు ఆఫీసుల్లో ఫర్నీచర్ ను తరలించడం వివాదాస్పదం అవుతోంది. మంగళవారం బోధన్ ఎమ్మెల్యే షకీల్ (Shakeel) ఆఫీస్ లో ఫర్నీచర్ తరలిస్తుండగా కాంగ్రెస్ (Congress) కార్యకర్తలు అడ్డుకున్నారు. తాజాగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) హైదరాబాద్ లోని ఆఫీస్ నుంచి సామగ్రిని తీసుకెళ్తుండగా ఓయూ (OU) విద్యార్థులు ఆపారు.
హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో మంత్రిగా ఉన్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ కు ఆఫీస్ ఉండేది. ఇందులోని ఫర్నీచర్, కంప్యూటర్లు, ఇతర వస్తువులను బుధవారం ఉదయం రెండు ట్రాలీల్లో తరలిస్తుండగా.. ఓయూ విద్యార్థి సంఘం నేతలు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన వస్తువులను ఎలా తరలిస్తారంటూ నిలదీశారు. ట్రాలీలను ముందుకు కదలనివ్వలేదు.
శ్రీనివాస్ గౌడ్ మనుషులు అక్రమంగా వీటిని తరలిస్తున్నారంటూ విద్యార్థి సంఘం నేతలు ధర్నాకు దిగారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. నాంపల్లిలోని టీజీవో భవన్ కు ఈ ఫర్నీచర్ ను తరలిస్తున్నట్లు ట్ర్యాలీ డ్రైవర్ తెలిపాడు. లోడ్ లో ఏసీ, ఫర్నిచర్, కంప్యూటర్స్, పలు ఫైల్స్ ను తరలించినట్లు విద్యార్థులు చెప్పారు.
ఇటు, మంగళవారం నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ఫర్నీచర్ తరలించడానికి మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరులు ప్రయత్నించారు. పార్టీ ఆపీస్ లో వాహనాన్ని గమనించి కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు సమాచారం ఇవ్వగా సామగ్రి తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఏసీలు, ఫ్యాన్లు, ఎల్ఈడీ లైట్లు, కుర్చీలు, టేబుల్స్, వాటర్ ట్యాంకులు తరలించడానికి యువకులు యత్నించారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది.