తెలంగాణ(Telangana)లో ఈ నెల 9వతేదీ నుంచి ఆర్టీసీ(RTC) బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే పథకాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు సంస్థ ఆపరేషన్స్ ఈడీ మునిశేఖర్ నేతృత్వంలో అధికారుల బృందం గురువారం హుటాహుటిన కర్ణాటకకు వెళ్లింది.
కర్ణాటకలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమలుతీరు, సంస్థపై ఆర్థిక ప్రభావం, ప్రభుత్వం నుంచి అందే ఆర్థికసాయం తదితర వివరాలు అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్‌కు ప్రాథమిక సమాచారాన్ని చేరవేశారు. శుక్రవారం కూడా అధ్యయనం కొనసాగనుంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశానికి శుక్రవారం అందుబాటులో ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ఇప్పటికే సమాచారం అందింది.
ముఖ్యమంత్రితో భేటీలో పలు అంశాలు చర్చించనున్నారు. అనంతరం మార్గదర్శకాలతో కూడిన పూర్తిస్థాయి ప్రకటన వెలువడనుంది. ఏఏ బస్సుల్లో మహిళలను అనుమతిస్తారు. ప్రయాణ పరిధి ఎంత, ప్రయాణించే వారు ఏఏ గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది తదితరాలను మార్గదర్శకాలను వెల్లడిస్తారు. ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా పథకాన్ని అమలుచేస్తాం.
తెలంగాణలో బస్సుల సంఖ్య 8,571గా ఉంది. ఆర్టీసీ నిత్యం 12నుంచి 13 లక్షల కిలోమీటర్ల మేర బస్సుల్ని నడుపుతోంది. సగటున రోజుకు రూ.14 కోట్ల రాబడి వస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సు ప్రయాణికుల్లో దాదాపు 40 శాతం మంది (12-13 లక్షల మంది) మహిళలు ఉంటున్నారు. ఉచిత ప్రయాణ పథకం అమలుతో రోజుకు సుమారు రూ.నాలుగు కోట్ల రాబడి తగ్గే అవకాశం ఉంటుంది.
అదేవిధంగా కర్ణాటకలో 22వేల పైచిలుకు బస్సులున్నాయి. ‘ప్రస్తుతం కర్ణాటక బస్సుల్లో 55 శాతం మహిళలు, 45 శాతం పురుషులు ప్రయాణిస్తున్నారు. పథకం అమలుకు ముందు బస్సుల్లో మహిళల సంఖ్య 40- 41 శాతంగా ఉండేదనీ.. పథకం అమలు తర్వాత 12-15 శాతం వరకు మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఆ ప్రకారం బస్సుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.