Telugu News » Telangana Assembly : ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్.. ఎందుకు..? ఎలా..?

Telangana Assembly : ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్.. ఎందుకు..? ఎలా..?

సీనియారిటీ ప్రకారం మాజీ సీఎం కేసీఆర్ ప్రొటెం స్పీకర్‌ గా వ్యవహరించాల్సి ఉంది. ఈయన 8 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. కానీ, సడెన్ గా ఆయన బాత్రూంలో కాలు జారి పడడం.. గాయాలతో ఆస్పత్రిలో చేరడం చకచకా జరిగిపోయాయి.

by admin

– ప్రొటెం స్పీకర్ ఎన్నికలో నాటకీయ పరిణామాలు
– సీనియర్ లీడర్ కేసీఆర్ ని ఎన్నుకుంటారని ప్రచారం
– అనూహ్యంగా కిందపడి ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం
– లిస్టులో పోచారం, దానం, తలసాని పేర్లు
– సడెన్ గా వీల్ చైర్ లో కనిపించిన పోచారం
– చివరకు ప్రోటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఎంపిక
– రేపు రాజ్‌ భవన్‌ లో ప్రమాణం చేయించనున్న గవర్నర్
– అసలు, ఈ ప్రొటెం స్పీకర్ ఎంపిక ఎలా జరుగుతుంది?

తెలంగాణ (Telangana) అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరిపించాలని రేవంత్‌ (Revanth) ప్రభుత్వం భావిస్తోంది. అయితే.. ప్రొటెం స్పీకర్ ఎంపిక విషయంలో అనేక ప్రచారాలు జరిగాయి. సస్పెన్స్ కు తెరదించుతూ చివరకు ప్రొటెం స్పీకర్‌ గా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ (Akbaruddin Owaisi) ఒవైసీని ఎంపిక చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ఈయన అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కొత్త స్పీకర్ ఎన్నికయ్యేంత వరకూ అక్బరుద్దీన్‌ ప్రొటెం స్పీకర్‌ గా ఉంటారు.

Akbaruddin Owaisi Appointed as Pro-tem Speaker of Telangana Assembly

కేసీఆర్ అనుకుంటే.. అక్బర్ కన్ఫామ్

సీనియారిటీ ప్రకారం మాజీ సీఎం కేసీఆర్ ప్రొటెం స్పీకర్‌ గా వ్యవహరించాల్సి ఉంది. ఈయన 8 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. కానీ, సడెన్ గా ఆయన బాత్రూంలో కాలు జారి పడడం.. గాయాలతో ఆస్పత్రిలో చేరడం చకచకా జరిగిపోయాయి. అంతేకాదు, సర్జరీ మస్ట్ అని.. 8 వారాల పాటు రెస్ట్ అంటూ డాక్టర్లు సూచించారు. దీంతో కేసీఆర్ కాకుండా ప్రొటెం స్పీకర్ ఎవరనే చర్చ జరగగా.. తర్వాతి వరుసలో బీఆర్ఎస్ నుంచి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ కనిపించారు. అలాగే, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఉన్నారు. కాంగ్రెస్‌ లో ఆరుసార్లు ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ఉత్తమ్, తుమ్మల ఉండగా.. వీరిద్దరూ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. బీఆర్ఎస్ నేతల కన్నా.. అక్బరుద్దీన్ ఒవైసీ వైపు మొగ్గు చూపారు.

ప్రొటెం స్పీకర్‌ ఎంపిక ఎలా ఉంటుంది?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 180(1) ప్రకారం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ స్థానాలు ఖాళీగా ఉన్నప్పుడు.. లోక్‌ సభ ప్రొటెం స్పీకర్‌ పద్దతిలోనే శాసనసభ ప్రొటెం స్పీకర్ ను ఎంపిక చేస్తారు. సాధారణంగా ఎమ్మెల్యేల్లోని సీనియర్ సభ్యుడినే నియమిస్తారు. అయితే.. అందరికన్నా సీనియర్ సభ్యుడినే ఎంపిక చేయాలన్న నిబంధన కూడా ఏమీ లేదు. కానీ, సీనియర్ ను ఎంపిక చేయడం ఎప్పటినుంచో జరుగుతోంది. ప్రొటెం స్పీకర్ కోసం మొదట కొందరు సీనియర్‌ సభ్యుల జాబితాను రూపొందిస్తారు. ఆ తర్వాత సభ్యుల అంగీకారంతో గవర్నర్ ఎంపిక చేస్తారు. లోక్ సభలో అయితే ఈ బాధ్యత రాష్ట్రపతికి ఉంటుంది.

ప్రొటెం స్పీకర్, స్పీకర్ మధ్య తేడా ఏంటి?

ప్రోటెమ్ స్పీకర్.. తాత్కాలికమే. పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలలో పనులు నిర్వహించడానికి, పరిమిత కాలానికి నియమిస్తారు. సభ్యుల అంగీకారంతో ఈ ఎన్నిక జరుగుతుంది. సాధారణంగా లోక్‌ సభ, శాసనసభలకు ఎన్నికలు జరిగి స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎంపిక జరగనప్పుడు అప్పటిదాకా ప్రొటెం స్పీకర్‌ ను ఎంపిక చేస్తారు. శాశ్వత స్పీకర్‌ ను ఎన్నుకునే వరకు కార్యకలాపాలను కొనసాగిస్తారు.

ప్రొటెం స్పీకర్ విధులు

కొత్తగా ఎన్నికైన సభ్యులందరితో ప్రమాణం చేయించడం, స్పీకర్‌ ఎన్నిక జరిగే వరకూ సభను నిర్వహించడం ప్రొటెం స్పీకర్ బాధ్యత. స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు ఇద్దరూ రాజీనామా చేయడం లేదా మరణించడం జరిగిన సందర్భాల్లోనూ ప్రొటెం స్పీకర్ ను నియమిస్తారు. స్పీకర్ ను ఎన్నుకునే స్థితిలో సభ లేనప్పుడు.. ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నదీ, లేనిదీ తేల్చే బల పరీక్షను ప్రొటెం స్పీకర్ నిర్వహిస్తారు.

ప్రొటెం స్పీకర్ అధికారాలు

ఆర్టికల్ 188(1) ప్రకారం ప్రొటెం స్పీకర్‌ కు అసెంబ్లీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేసే అధికారం మాత్రమే ఉంటుంది. అయితే.. ఆర్టికల్ 180(1) ప్రకారం స్పీకర్ అధికారాలు, విధులను నిర్వర్తించవచ్చు. ఉండేది తక్కువ సమయమే కావడంతో పరిమిత అధికారాలతో ప్రొటెం స్పీకర్ పని చేస్తుంటారు.

You may also like

Leave a Comment