బాలీవుడ్ నటి జరీన్ ఖాన్‌కు (Zareen Khan) చీటింగ్ కేసులో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 2018 నాటి చీటింగ్ కేసులో ఆమెకు మధ్యంతర బెయిల్ లభించింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదనే షరతు విధిస్తూ కోల్‌కతా సిటీ కోర్టు ఆమెకు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. రూ.30 వేల వ్యక్తిగత పూచీకత్తుతో ఈ నెల 26 వరకు బెయిల్ మంజూరుచేస్తూ (Interim Bail) సీల్దా కోర్టు (Sealdah Court) తీర్పునిచ్చింది.
కోల్‌కతాలో జరిగిన దూర్గా పూజలో (Durga Puja) పాల్గొనేందుకు 2018లో నిర్వహాకుల నుంచి జరీన్ ఖాన్ రూ.12 లక్షలు అడ్వాన్సుగా తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.. కానీ ఆ కార్యక్రమంలో జరీన్ ఖాన్ పాల్గొనలేదు.. ఈ విషయంలో జరీన్‌తోపాటు ఆమె మేనేజరుపై నార్కెల్‌దంగ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి గత సెప్టెంబర్‌లో జరీన్ ఖాన్‌కు న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ప్రస్తుతం కోల్‌కతా పోలీసుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడానికి వీలులేదని ఆంక్షలు విధించిన కోర్టు.. విచారణకు తప్పని సరిగ్గా హాజరుకావాలని ఆదేశించింది. కాగా, జరీన్ ఖాన్, కాల్ సెంటర్ లో జాబ్ చేస్తూనే సినిమా ఆఫర్స్ కోసం ట్రై చేసింది. లుక్స్ పరంగా కత్రినా కైఫ్ ని పోలి ఉండే జరీన్.. ‘వీర్’ మూవీతో తెరంగేట్రం చేసింది.
ఆ తర్వాత హౌస్ ఫుల్ 2.. హేట్ స్టోరీ 3.. అక్సర్ 2.. హమ్ భీ అఖేలే తుమ్ భీ అఖేలే వంటి సినిమాలతో ఆకట్టుకుంది. హీరోయిన్ గా నటిస్తూనే అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది. తెలుగు తెరకు గోపిచంద్ హీరోగా తెరకెక్కిన చాణక్య చిత్రంతో పరిచయం అయ్యింది.