Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పుట్టిన రోజున తన సన్నిహితుడు, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను గుర్తు చేసుకున్నారు. ‘ఐ మిస్ యూ మనీష్’ అని ఆవేదనతో వ్యాఖ్యానించారు. బుధవారం తన బర్త్ డే కావడంతో పలువురు ప్రముఖులు, స్నేహితులు, మద్దతుదారులు ఆయనను అభినందిస్తూ శుభాకాంక్షల సందేశాలు పంపారు. వీరిలో ప్రధాని మోడీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తదితరులున్నారు. మీకు భగవంతుడు ఆరోగ్యవంతమైన జీవితం ఇవ్వాలని మోడీ తన సందేశంలో పేర్కొన్నారు. ఇందుకు కేజ్రీవాల్ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
కానీ ఈ నా పుట్టిన రోజున నా సన్నిహితుడు, మాజీ విద్యా శాఖ మంత్రి కూడా అయిన మనీష్ సిసోడియా తన వద్ద లేరని ఆయనను తలుచుకుని కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు. తప్పుడు కేసులో ఆయనను జైలుకు పంపించారని అన్నారు. ఈ దేశంలో జన్మించిన ప్రతి బిడ్డకు ఉత్తమమైన, నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తామని అందరం ఈ రోజున ప్రమాణం చేద్దామని ఆయన అన్నారు.
ఇది ఇండియాకు బలమైన పునాది వేస్తుందని, ఇది కూడా మనీష్ ను సంతోషపరుస్తుందని ఆయన ట్వీట్ చేశారు. ఇండియాను నెంబర్ 1 చేయాలన్నదే మనీష్ ఉద్దేశం కూడానన్నారు. బుధవారం కేజ్రీ 55 వ పుట్టిన రోజు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాను గత ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. సిబిఐ, ఈడీ కూడా ఆయనపై కేసులు నమోదు చేశాయి. తన భార్య అనారోగ్యం కారణంగా తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన అనేకసార్లు పెట్టుకున్న పిటిషన్లను కోర్టులు తిరస్కరించాయి. అయితే సుప్రీంకోర్టులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సెప్టెంబరు 4 న విచారణ జరగనుంది.