ఆస్ట్రేలియా(AUS) ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ (Cameron Green) షాకింగ్ న్యూస్ చెప్పాడు. తాను చిన్నతనం నుంచి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నానని తెలిపాడు. అది పూర్తిగా నయంకాని వ్యాధి అని, లక్షణాలు కూడా ఉండవని చెప్పాడు. ఈ విషయాన్ని ఇప్పటివరకు గోప్యంగా ఉంచానని వెల్లడించాడు.
ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సుదీర్ఘ ఫార్మాట్ సిరీస్‌కు కామెరూన్ గ్రీన్ ఎంపికవ్వలేదు. అయితే ఇటీవల కామెరూన్ గ్రీన్ ఫ్యామిలీ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు తెలిపాడు.
‘పుట్టినప్పటి నుంచే నాకు దీర్ఘకాలిక కిడ్నీ సమస్య ఉందని మా పేరెంట్స్ చెప్పారు. అయితే ఆ వ్యాధికి లక్షణాలేమి లేవు. అల్ట్రాసౌండ్‌తో గుర్తించాలి. కిడ్నీలు ఎప్పటికీ పూర్తిగా కోలుకోలేవు. ఇతరుల కిడ్నీలూ పనిచేయలేవు. ప్రస్తుతం 60శాతం పనిచేస్తున్నాయి. స్టేజ్-2లో ఉన్నాను’ అని కామెరూన్ గ్రీన్ ఎమోషనల్ అయ్యాడు.
గ్రీన్ తండ్రి మాట్లాడుతూ.. మొదట్లో గ్రీన్ త్వరగా కోలుకోలేదని, అప్పుడు డాక్టర్లు 12ఏళ్లకు మించి బతకలేడని చెప్పారని అన్నారు. గ్రీన్ తల్లి మాట్లాడుతూ.. 19 వారాల స్కానింగ్‌లో ఈ వ్యాధి గురించి తెలిసిందని, గ్రీన్ పుట్టిన తర్వాత ఇంక్యుబేటర్‌లో ఉంచారని తెలిపారు.
కాగా, 24 ఏళ్ల గ్రీన్ ఐపీఎల్ వచ్చే సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఇటీవల ఆర్‌సీబీ గ్రీన్‌ను ముంబయి ఇండియన్స్ నుంచి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. రూ.17.5 కోట్లు వెచ్చించి బెంగళూరు తీసుకుంది. ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్య కోసమే కామెరూన్ గ్రీన్‌ను ఆర్‌సీబీకి అమ్మేసింది.