తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేసిన రేవంత్ రెడ్డి.. ఎట్టకేలకు అధికార పీఠం అధిరోహించి రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా నిలిచిపోయారు. అయితే ప్రభుత్వాన్ని ప్రజల అభీష్టాలకి అనుగుణంగా నడుపుదామని అనుకోని.. ప్రచారం సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మొదటగా.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తెచ్చారు. కానీ ఉచితం అనే పదం ప్రభుత్వం మెడకు గుదిబండ మారుతోందని ఆరోపణలు వస్తున్నాయి..
ప్రభుత్వం ప్రకటించిన ఆర్టీసీ ఉచిత బస్సు సర్వీస్ (RTC Free Bus Service) వల్ల ఆటో డ్రైవరలకు తీవ్ర నష్టం జరుగుతుందని బీఎంఎస్ ఆటో యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రోజుకు 70 శాతం మహిళలు ఆటోల్లో ప్రయాణించడం వల్ల రోజుకి 1000 రూపాయలు ఆదాయం వస్తే.. ప్రస్తుతం 300 కూడా రావట్లేదని వాపోతున్నారు. ఉచిత పథకాలతో ఆటో డ్రైవర్ల ఉపాధిపై దెబ్బకొట్టొద్దని ప్రభుత్వాన్ని కోరుతోన్నారు.
మా గోస ప్రభుత్వానికి తెలిసేలా భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో వరుసగా నిరసన కార్యక్రమలకు పిలుపునిస్తున్నామని వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వం రవాణా చట్టానికి విరుద్దంగా ఓల, ఊబర్ సర్వీస్ లను తెచ్చిందని ఆటో యూనియన్ నేతలు మండిపడ్డారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో డ్రైవర్ల తో చర్చలు జరపాలని తెలిపిన యూనియన్ నేతలు.. ప్రభుత్వం స్పందించకుంటే ఈనెల 18న ధర్నాలు, ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు 19న వినతిపత్రాలు సమర్పిస్తామని అన్నారు. 20న ఆర్టీసీ డిపోల దగ్గర శాంతియుతంగా ఆందోళన చేపడతామని పేర్కొన్నారు.
మరోవైపు రాజన్న సిరిసిల్ల (Rajanna Sirisilla) జిల్లాలో ఆటో కార్మికులు నిరసన, భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణం కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు 8 వందలకు పైగా ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆటో యూనియన్ నాయకులు నినాదాలు చేశారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడాన్ని వెంటనే రద్దు చేయాలి అంటూ డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం గేటు దగ్గర ఏవో రాంరెడ్డికి వినతిపత్రం సమర్పించారు.