సింగరేణి ఎన్నికల (Singareni Election)పై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.. హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణను వాయిదా పడింది.. ఇవాళ విచారించిన హైకోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 21కి వాయిదా వేసింది. కాగా సింగరేణి ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ (December) 27న జరగాల్సి ఉంది. కానీ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటం, ఇతర కారణాల దృష్ట్యా ఎన్నికలను మార్చి నెలాఖరుకు వాయిదా వేయాలని కోరుతూ ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హైకోర్టు (High Court)లో పిటిషన్ వేసినట్టు సమాచారం.
మరోవైపు ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని, అడ్మినిస్ట్రేటివ్, శాంతిభద్రతల పరమైన ఇబ్బందులు ఉన్నట్టు, ఎన్నికలకు మరింత గడువు కావాలని, మార్చి తర్వాత నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని కాంగ్రెస్ (Congress)సర్కార్ భావిస్తోన్నట్టు సమాచారం.. ఈ నేపథ్యంలోనే ఇంధనశాఖ హైకోర్టులో పిటిషన్వేసినట్లు ప్రచారం జరుగుతుంది.
మరోవైపు సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ ఓడిపోతుందనే భయంతో ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అదీగాక యూనియన్ ఎన్నికలు ఇప్పుడు జరిగితే అనుబంధ ఐఎన్టీయూసీ యూనియన్ గెలుపొటములపై ప్రభావం చూపుతుందని భావించే సర్కారు కోర్టును ఆశ్రయించిందని ఇతర కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
అయితే కోర్టు నుంచి వచ్చే తీర్పును బట్టి ఎన్నికల నిర్వహణపై స్పష్టత రానున్నట్టు తెలుస్తోంది.ఇదిలా ఉండగా సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలపై డిసెంబర్ 14న మంత్రి శ్రీధర్‌బాబు అసెంబ్లీలోని సీఎల్పీ ఆఫీస్‌లో కోల్ బెల్ట్ప్రాంత ఎమ్మెల్యేలు, ఐఎన్టీయూసీ నాయకులతో సమావేశమైన విషయం తెలిసిందే..