దుబాయ్ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL-2024) మినీ వేలానికి సర్వం సిద్ధమైంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ వేలం మంగళవారం (డిసెంబర్ 19) జరగనుంది. ఈ నేపథ్యంలో వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీలు దృష్టిపెట్టాయి. అయితే ఈ సారి మినీ వేలాన్ని ఓ మహిళ ప్రాతినిథ్యం వహించనున్నారు. ఆమె ఎవరో కాదు.. మహిళా ఆక్షనీర్ మల్లికా సాగర్(Mallika Sagar).
గత కొన్ని ఐపీఎల్ సీజన్లకు ఆక్షనర్‌గా వ్యవహరించిన హ్యూ ఎడ్మీడ్స్ స్థానంలో ఈసారి మల్లికా సాగర్ అడ్వాణీ భర్తీ చేస్తున్నారు. దీంతో ఆమె తొలి మహిళా ఆక్షనీర్‌గా నిలవనుంది. అంతేకాదు.. క్రిస్టీస్‌లో వేలం నిర్వహించిన భారత సంతతికి తొలి మహిళ ఆక్షనీర్ కూడా మల్లికానే. మహారాష్ట్రలోని ముంబయికి చెందిన ఓ ఆర్ట్ కలెక్టర్. మోడ్రన్ అండ్ కాన్టెంపరరీ ఇండియన్ ఆర్ట్ అనే ముంబయి ఆధారిత సంస్థకు ఆమె ఆర్ట్ కలెక్టర్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు.
అయితే, 20 ఏళ్లగా వేలం నిర్వాహకురాలిగా ఆమె పనిచేస్తున్నారు. 2001లో క్రిస్టీస్ ఆక్షన్ హౌస్ వేలం నిర్వాహకురాలిగా తన కెరీర్ మొదలుపెట్టారు. 2021లో ప్రో కబడ్డీ లీగ్ వేలంలో తన వాక్చాతుర్యంతో మల్లిక అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత మహిళల ప్రీమియర్ లీగ్ తొలి, రెండు సీజన్లకు సంబంధించిన వేలాన్ని కూడా మల్లికానే నిర్వహించారు. ఇప్పుడు మరోసారి వేలాన్ని దిగ్విజయంగా ముగించేందుకు మల్లికా సిద్ధమయ్యారు.
ఈ మినీ వేలంలో భారత్ సహా 12 దేశాల నుంచి మొత్తం 333 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. అయితే ఉన్న ఖాళీలు 77 మాత్రమే. వేలంలో ఖర్చు పెట్టడానికి ఫ్రాంఛైజీల వద్ద మొత్తం రూ.262.95 కోట్లు ఉన్నాయి. గరిష్ఠంగా 30 మంది విదేశీ క్రికెటర్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.