తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఏర్పడి పదిహేను రోజులు గడవక ముందే ప్రతిపక్ష నేతలు విమర్శలు చేయడం సంచలనంగా మారింది. కాగా ఇదే సమయంలో ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ (Kranti Kiran) తమ్ముడు రాహుల్ కిరణ్ దళితబంధు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసినట్టు వస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి.
మెదక్ జిల్లా పాల్వంచ గ్రామంలో నలుగురు దళితుల నుంచి రాహుల్ కిరణ్ (Rahul Kiran) 3 లక్షల చొప్పున మొత్తం 12 లక్షలు తీసుకొన్నట్టు.. భూమయ్య అనే వ్యక్తి ఆరోపిస్తున్నాడు. అయితే ఎన్ని రోజులు అయినా దళితబంధు రాకపోవడంతో ఆందోళన చెందిన భూమయ్య.. డబ్బుల కోసం రాహుల్ కిరణ్ సంప్రదిస్తే.. అతను సృజన్ అనే వ్యక్తి ద్వారా బెదిరించినట్టు భూమయ్య ఆరోపించాడు.. ఈ విషయంపై టేక్మల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు.
మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలకి స్పందించిన క్రాంతి కిరణ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. భూమయ్య చేస్తున్నటువంటి ఆరోపణలు నిజం కాదని క్లారిటీ ఇచ్చారు. కేవలం రాజకీయ కక్షతో ఇలా నాపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తను తప్పు చేస్తే లై డిటెక్టర్ పరీక్షకు సైతం రెడీ అని తెలిపిన క్రాంతి కిరణ్.. కావాలనే మంత్రి దామోదర రాజనర్సింహ తనపై కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు.
నియోజకవర్గంలో దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) చేస్తున్న అరాచకాలకు ఈ ఫిర్యాదు పరాకాష్ట అని విమర్శించిన క్రాంతి కిరణ్.. తప్పుడు కేసులతో తమ కార్యకర్తలను వేధిస్తున్నాడని మండిపడ్డారు. రాజనర్సింహ మంత్రిగా అన్ని స్థాయిల్లోని అధికారులను బెదిరింపులతో తమదారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడని క్రాంతి కిరణ్ ఆరోపణలు గుప్పించారు.