Telugu News » Telangana : ఆ భూములన్నీ వెనక్కి తీసుకోవచ్చుగా.. రేవంత్ ప్రభుత్వానికి ‘రాష్ట్ర’ సూచన

Telangana : ఆ భూములన్నీ వెనక్కి తీసుకోవచ్చుగా.. రేవంత్ ప్రభుత్వానికి ‘రాష్ట్ర’ సూచన

by admin
revanth-sarkar

– అంతంతమాత్రంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి
– గత ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్న కాంగ్రెస్ సర్కార్
– మరి, అప్పటి తప్పిదాలపై ఫోకస్ ఏది?
– ఆనాడు భూ కబ్జాలు, కేటాయింపులపై రాద్ధాంతం
– ఇప్పుడు మాటలకే పరిమితమా?
– ఆర్థిక కష్టాలు తొలగిపోయే అడుగులు ఏవి?
– కాంగ్రెస్ సర్కార్ కు ‘రాష్ట్ర’ సూచన

తెలంగాణ (Telangana) లో బీఆర్ఎస్ (BRS) పాలన పోయి కాంగ్రెస్ (Congress) సర్కార్ వచ్చింది. మంత్రులకు శాఖల కేటాయింపు, బాధ్యతల స్వీకరణ ఇలా అన్నీ చకచకా జరిగాయి. పాలనపై పట్టు సాధించేందుకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్ని శాఖలపై ఫోకస్ పెట్టారు. కానీ, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందనేది ప్రభుత్వ పెద్దల వాదన. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని.. అంతా సర్వనాశనం చేశారని పదే పదే వినిపిస్తున్నారు. దీనిపై శ్వేతపత్రం కూడా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే.. ప్రభుత్వానికి ‘రాష్ట్ర’ (Raashtra) కీలక సూచన చేస్తోంది. మరి, దీన్ని అమలు చేసే ధైర్యం సర్కారుకు ఉందా..?

cm revanth reddy review on dharani portal

బీఆర్ఎస్ స్థలం అమ్మేయొచ్చుగా..!

గత ప్రభుత్వంలో రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో 11 ఎకరాలను బీఆర్ఎస్​ కు కేటాయింపు జరిగింది. దాని విలువ అప్పట్లో అక్షరాలా రూ.550 కోట్లు. ఇప్పుడైతే.. దీని విలువ బహిరంగ మార్కెట్ లో రూ.1,100 కోట్ల పైపెచ్చు పలుకుతుంది. కానీ, బీఆర్ఎస్ కు కేవలం రూ.37.53 కోట్లకే ముట్టజెప్పేందుకు అంగీకారం జరిగింది. గత మే నెల 12న ప్రభుత్వానికి బీఆర్ఎస్ దరఖాస్తు చేసుకోగా.. కోకాపేటలోని 239, 240 సర్వే నెంబర్లలో భూమి కేటాయించాలని కలెక్టర్ ను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కోరారు. వెంటనే స్పందించిన కలెక్టర్.. 11 ఎకరాల జాగా ను హెచ్ఎండీఏ ద్వారా ఇప్పించాలని 16న సీసీఎల్​ఏకు ప్రతిపాదనలు పంపించారు. అంతేకాదు.. ఆ సర్వే నెంబర్లలో అప్పటి ఎకరా ధర మార్కెట్ ​రేటు ప్రకారం రూ.3 కోట్ల 41 లక్షల 25 వేలు ఉందని.. 11 ఎకరాలకు రూ.37 కోట్ల 53 లక్షల 75 వేలు అవుతుందని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, విద్యావేత్తలకు శిక్షణ, పర్సనాలిటీ డెవలప్​ మెంట్​ కోసం ఇనిస్టిట్యూట్​ ఫర్​ ఎక్సలెన్స్ ​అండ్​ హ్యూమన్ ​రీసోర్స్ ​డెవలప్​ మెంట్​ ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ దరఖాస్తులో పేర్కొంది. దీనిపై అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తెగ విమర్శల దాడి చేసింది. వందల కోట్ల విలువైన భూమిని అతి తక్కువ ధరకు ఇవ్వడంపై మండిపడింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. అసలే, ఆర్థిక కష్టాలు అంటున్నారు. మరి, ఆ భూమిని వెనక్కి తీసేసుకుని అమ్మితే.. ఇప్పటి రేటుకు రూ.1,100 కోట్లకు పైపెచ్చు పలుకుతుంది. మరి, రేవంత్ సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తుందా?

కమ్మ, వెలమ భవనాలూ అంతే..!

హైటెక్ సిటీలో భూమి రేట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. అలాంటి చోట.. బీఆర్ఎస్ హయాంలో అప్పనంగా కమ్మ, వెలమ కుల సంఘాల భవనాలకు పదెకరాల భూమి కేటాయించారు. దీనికోసం రహస్యంగా జీవోను కూడా విడుదల చేశారు. ఈ మొత్తం భూమి విలువ అప్పట్లోనే రూ.870 కోట్ల దాకా ఉంది. ఇప్పుడు ఇంకా ఎక్కువే ఉంటుంది. కమ్మ సేవా సంఘ సమాఖ్యకు 5 ఎకరాలు, ఆలిండియా వెలమ అసోసియేషన్​ కు 5 ఎకరాల భూమిని అప్పటి సర్కారు కేటాయించింది. ఖానామెట్​ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నెం.41/14 లో ఈ భూములున్నాయి. గ్రేటర్​ హైదరాబాద్​ సిటీలోనే ఇదే కాస్ట్ ​లీ ఏరియా. ఇక్కడ గజం జాగా రూ.1.80 లక్షల దాకా ఉంది. అంటే, ఒక్కో ఎకరం రూ.87 కోట్లకుపైనే పలుకుతుంది. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం వెలమ, కమ్మ కులాలకు కేటాయించిన మొత్తం పదెకరాల స్థలం విలువ రూ.870 కోట్లకుపైనే. 2014లో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం రాష్ట్రంలో కమ్మ, వెలమల జనాభా కేవలం 0.1 శాతం కన్నా తక్కువే. అలాంటి కులాలకు సిటీ నడిబొడ్డున ఇచ్చి ఇతర కులాలకు మాత్రం శివార్లలో కొండలు, గుట్టల్లో అగ్గువ స్థలాలు ఇవ్వడంపై అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది. మరి, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఆ స్థలాలను స్వాధీనం చేసుకుని వీళ్లకు కూడా శివారు ప్రాంతాల్లో ఇచ్చి.. దాన్ని అమ్మితే ఇప్పుడున్న రేటుకు వెయ్యి కోట్ల దాకా వస్తుంది. మరి, రేవంత్ సర్కార్ అది చేస్తుందా..?

‘రాష్ట్ర’ చెప్పినట్టు చేస్తారా?

తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం సరిగ్గా లేదని అంటోంది ప్రభుత్వం. అయితే.. దీని వెనుక భిన్న వాదనలు ఉన్నాయి. ఇచ్చిన ఉచిత హామీల అమలు ఇప్పుడప్పుడే సాధ్యం అయ్యేది కాదని గ్రహించిన కాంగ్రెస్ సర్కార్.. శ్వేతపత్రంతో జాప్యం చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సమీక్షలు, ప్రచారాలు, హంగులూ, ఆర్భాటాలు తప్ప ప్రజలకు అక్కరకొచ్చే ఒక్క ముచ్చటా కాంగ్రెస్ హయాంలో జరగలేదనే విమర్శలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి అంత బాగాలేనప్పుడు దానికి తగినట్టుగా కబ్జాలు, కేటాయింపులపై దృష్టి సారించి వాటిని స్వాధీనం చేసుకుంటే కొంతలో కొంతైన ఆర్థిక పరిస్థితి గాడిన పడే అవకాశం ఉంటుంది. రేవంత్ సర్కార్ ఈ దిశగా అడుగులు వేస్తే బాగుంటుందనేది ‘రాష్ట్ర’ సూచన.

You may also like

Leave a Comment