ఏపీ(AP)లో సిట్టింగ్ సీట్ల విషయంలో వైసీపీ(YCP)లో మార్పులు, చేర్పులు, టికెట్ల నిరాకరణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంత్రి ఆర్కే రోజా(Minister Roja)కు ఈ సారి టికెట్ దక్కదంటూ ప్రచారం జరుగుతోంది. అలాంటి వార్తలపై తాజాగా ఎమ్మెల్యే రోజా స్పందించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె మీడియాతో మాట్లాడారు. కొంతమంది పనిగట్టుకుని తనకు టికెట్ రాదంటూ ప్రచారం చేస్తూ శునకానందాన్ని పొందుతున్నారని ఎమ్మెల్యే రోజా విరుచుపడ్డారు.
కొద్ది రోజులకుగా వైసీపీలో మార్పులు ఏపీని వణికిస్తున్నాయి. ఏపీలో అధికార వైసీపీ రెండోసారి ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలని తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, ముగ్గురు మంత్రులను మార్చింది. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో కొత్త సమన్వయకర్తల ఏర్పాటుతో ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ లేదని చెప్పకనే చెప్పింది. తాజాగా సోమవారం మరో మంత్రికి కూడా ఇదే జరిగింది.
తిరుమలలో ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. ఒక్కచోట పోటీచేస్తే గెలుస్తామో, లేదో అన్న అనుమానంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయాలో రెండేసి నియోజకవర్గాల్లో సర్వే చేయించుకున్నారని ఎద్దేవా చేశారు. జగనన్న మాట శిరోధార్యమని, ఆయన ఏది చెబితే అదే చేస్తానని రోజా అన్నారు. ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు మొదలు అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ముందు వరుసలో ఉన్నానని చెప్పుకొచ్చారు.
అయితే మార్పుల విషయంలో సీఎం వైయస్ జగన్ ఎస్సీలనే ఎక్కువగా మారుస్తుండడం చర్చనీయాంశంగా మారింది. వారం రోజుల కిందట 11నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులో ఐదుగురు దళితులు, ముగ్గురు బీసీలు ఉన్నారు. ఇదే కోవలో సోమవారం కలిసిన వారిలో కూడా ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలు, ఒక ఎస్టీ ఎంపీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
సోమవారం కొంతమందికి స్థానచలనం కలగగా, మరి కొంతమందికి అసలు టికెట్టే దక్కదని తెలిపారు. ఇద్దరు ఎస్సీ శాసన సభ్యులు, ఒక ఎస్టీ ఎమ్మెల్యేకు స్థాన చలనం తప్పదని తెలుస్తోంది. మరోవైపు బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. మరోవైపు 2019లో టీడీపీ నుంచి గెలిచి ఆ తర్వాత వైసీపీకి మద్దతు పలికారు. ఈయన బాటలోనే ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ కూడా సోమవారం ముఖ్యమంత్రిని కలిసి ఈసారి ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని చెప్పేశానని అంటున్నారు.