తెలంగాణ రాజకీయాల్లో వచ్చిన మార్పు ఏపీలో కూడా రానుందా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఇదే చర్చ సాగుతోన్నట్టు ప్రచారం.. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ రాజకీయ పరిణామాలు వేగంగా మారే అవకాశాలు ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఏపీలో ఎన్నికలు ముందుగా జరుగుతాయన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో అధికార వైసీపీ (YCP) ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) సైతం ప్రచారంలో, అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది.
కాగా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని గద్దె దించాలన్న లక్ష్యంతో టీడీపీ.. జనసేన శ్రమిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకు టీడీపీ, జనసేన కలసి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. రెండు పార్టీల మధ్య సీట్ల పంపకంపై స్పష్టత వస్తే గాని ఎవరి వ్యూహాలతో వారు జనం ముందుకు వెళ్లలేరని తెలుస్తోంది. అయితే రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరి నెలలు గడుస్తున్నప్పటికీ ఉమ్మడి కార్యాచరణ విషయంలో ఇప్పటికీ సరైన స్పష్టత రావడం లేదు.
ఇక రాజమండ్రి సెంట్రల్ జైల్‌కి చంద్రబాబు వెళ్ళిన తర్వాత.. జనసేన.. టీడీపీ (TDP) బంధం బాగా బలపడినట్టు ప్రచారం జరిగింది. బాబు జైలుకి వెళ్ళిన తర్వాత టీడీపీలో బాలయ్య పెద్దన్న పాత్ర పోషిస్తారని అంతా భావించారు.. కాని పవన్ ఎంట్రీ.. టీడీపీకి ఊరట కలిగించిందనే వాదన లేకపోలేదు.. ఇందుకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సైతం ప్రవర్తించారు.. మొత్తంగా క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరింది. మరోవైపు పొత్తుల ప్రకటన తర్వాత చంద్రబాబు.. పవన్ కలిసి ఇంత వరకూ ఒకే వేదికపైకి రాలేదు. పలుమార్లు వీరు సమావేశమైనప్పటికీ అంతర్గతంగా చర్చించుకున్నారే తప్ప బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు.
అయితే లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా బుధవారం మొదటి సారి ఒకే వేదికపైకి వస్తున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక టీడీపీ-జనసేన పొత్తును ప్రజలు హర్షించడం లేదని అధికార వైయస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. మరోవైపు జనసేన.. బీజేపీతో పొత్తులో ఎలాంటి స్పష్టత లేదని అనుకొంటున్నారు. ఓవైపు పవన్ కళ్యాణ్ ఎన్డీయేలో ఉన్నానని చెబుతున్నారు, మరోవైపు టీడీపీతో పొత్తు..
ఇలా రెండు పడవల మీద ప్రయాణం చేస్తోన్న పవన్.. క్లారిటీ లేకుండా కేవలం పాదయాత్ర, ప్రభుత్వ వైఫల్యాలపై మాత్రమే మాట్లాడతారా? అనే అంశాలు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికలకు మూడు నెలలు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికీ ఇద్దరు నేతలు కలిపి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు, మరి భవిష్యత్ కార్యాచరణపై కూడా ఈ వేదికపై నుంచి స్పష్టత ఇస్తారా? అనే సందేహాలు వెల్లువెత్తుతోన్నాయి..