– అసెంబ్లీలో శ్వేతపత్రం వార్
– హరీష్ వర్సెస్ రేవంత్
– తెచ్చిన ప్రతి పైసా అభివృద్ధికే ఖర్చు చేశాం
– మేడిగడ్డపై సింగిల్ జడ్జితో విచారణ చేసుకోవచ్చు
– రేవంత్ సర్కార్ కు హరీష్ సవాల్
– బ్యాంకులకు తప్పుడు నివేదికలు ఇచ్చారు
– కాళేశ్వరం రూ.80వేల కోట్లతో కట్టామన్నది అబద్ధం
– మిషన్ భగీరథ తర్వాతనే నీళ్లు తాగామా?
– 2014కు ముందు ఎవరూ నీళ్లు తాగలేదా?
– సభను హరీష్ తప్పుదోవ పట్టిస్తున్నారని రేవంత్ ఆగ్రహం
రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని కాంగ్రెస్ (Congress) అంటోంది. అప్పులు తెచ్చినా అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ (BRS) చెబుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao).. అప్పుల సంగతి సరే అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందిస్తూ.. కాళేశ్వరం విషయంలో అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు.
ముందుగా హరీష్ రావు మాట్లాడుతూ.. అప్పులు తెచ్చి రాష్ట్రంలో ఆస్తులు సృష్టించామని పేర్కొన్నారు. తెచ్చిన ప్రతి పైసా భవిష్యత్ అవసరాల కోసం ఖర్చు పెట్టామని స్పష్టం చేశారు. ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం రుణాలు తెచ్చామన్నారు. మంచినీళ్ల విషయంలో ప్రజల నుంచి ఎక్కడా ఒక్క రూపాయి వసూలు చేయలేదని తెలిపారు. తెచ్చిన అప్పులు ఎలా వినియోగించాం అనేది ముఖ్యమని చెప్పారు. 2014లో కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ఉండేదని, దాన్ని 4 కోట్లకు పెంచామని తెలిపారు. రూ.1,649 కోట్లతో 25 జిల్లాల్లో కలెక్టరేట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. దమ్ముంటే మేడిగడ్డపై సింగిల్ జడ్జితో విచారణ జరిపించుకోవచ్చని.. తమ నిజాయితీ ఏంటో బయట పడుతుందని అన్నారు.
హరీష్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కాళేశ్వరాన్ని రూ.80వేల కోట్లతో కట్టామనడం అబద్ధమని అన్నారు. కార్పొరేషన్ రుణమే రూ.97,448 కోట్లు మంజూరైందని తెలిపారు. ప్రభుత్వం పెట్టిన ఖర్చు, తెచ్చిన రుణాలు కలిపితే అసలు లెక్క తేలుతుందని పేర్కొన్నారు. కాళేశ్వరం అద్భుతం అని హరీష్ రావు సభను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలని విమర్శించారు. కాళేశ్వరంపై వచ్చే ఆదాయంతో అప్పులు చెల్లిస్తామని చూపించారని, ఇలా చెప్పే అప్పులు తీసుకువచ్చారని అన్నారు. మిషన్ భగీరథ తర్వాతనే నీళ్లు తాగామా? 2014కు ముందు ఎవరూ నీళ్లు తాగలేదా? అని ప్రశ్నించారు. మిషన్ భగీరథ ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తామని చూపించారని తెలిపారు. ఆదాయంతోనే అప్పులు చెల్లిస్తామని బ్యాంకులకు తప్పుడు నివేదికలు ఇచ్చారని తెలిపారు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం, భగీరథతో రూ.10 వేల కోట్లు ఏటా జనం నుంచి వసూలు చేస్తామని నివేదికలిచ్చారని అన్నారు.
సీఎం వ్యాఖ్యలపై హరీష్ స్పందించారు. సభను తాను కాదు సీఎం తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ద్వారా తీసుకున్న రుణాలు మిగిలిన ప్రాజెక్టులకూ వాడామని స్పష్టం చేశారు. తమ కంటే బాగా పాలించి మంచి పేరు తెచ్చుకోమని సలహా ఇచ్చారు. మీ గ్యారంటీలు బాగా అమలు చేసి పేరు తెచ్చుకోండని అన్నారు. ఈ శ్వేత పత్రాలు రాష్ట్ర ప్రగతికి కోత పత్రాలు అవుతాయని పేర్కొన్నారు. ఎటువంటి విచారణకు అయినా సిద్ధమని స్పష్టం చేశారు.
పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు కి మైక్ ఇవ్వాలని వెల్ లోకి వెళ్లారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ సభ్యులు వెల్ లోకి రావడంపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. శాసనసభ స్పీకర్ ను మంత్రులు డిక్టేట్ చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. అదే సమయంలో తనకి మంత్రి పదవి ఇవ్వరని హరీష్ అన్నారని, ఎంత బాగా పనిచేసినా ఆయన్ను కేసీఆర్ సీఎం చేయరని కౌంటర్ ఇచ్చారు. దీనిపై హరీష్ స్పందిస్తూ.. రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కునే కర్మ తమకు పట్టలేదని అన్నారు. ఈ వ్యాఖ్యలను ఖండించారు మంత్రి శ్రీధర్ బాబు. వెంటనే, తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే.. ముందు రాజగోపాల్ రెడ్డి ఉపసంహరించుకుంటే తానూ వెనక్కి తీసుకుంటానని స్పష్టం చేశారు.
హరీశ్‌రావు మాట్లాడిన వ్యాఖ్యలు వెనక్కితీసుకోవాలని స్పీకర్ ప్రసాద్ సూచించారు. అందుకు బదులిచ్చిన మాజీ మంత్రి.. స్పీకర్, సీఎంపై తాను వ్యాఖ్యలు చేయలేదని రాజగోపాల్ గతంలో చెప్పినవే చెప్పానని వివరించారు. అయితే.. స్పీకర్ మాత్రం ఆ వ్యాఖ్యలను తొలగించాలని ఆదేశించారు. ఇదే సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. పార్టీ వ్యవహారాలను ఇక్కడెందుకు ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. తాము కూడా కేసీఆర్, హరీష్ మధ్య గొడవలు చెప్పమంటారా? అంటూ కౌంటర్ ఇచ్చారు. అయితే.. స్పీకర్ మంత్రి మైక్ కట్ చేసి సముదాయించారు.