స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా(Rashmika Mandanna)కు సంబంధించిన డీప్‌ఫేక్ వీడియో (Deepfake Video) ఇటీవలే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు (Delhi Police) నలుగురు నిందితుల్ని గుర్తించినట్లు తెలిపారు.
అయితే, ఆ నకిలీ వీడియో తయారు చేసింది మాత్రం ఈ నలుగురు కాదని, వారు అప్‌లోడ్ మాత్రమే చేశారని పోలీసులు బుధవారం స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో డీప్‌ఫేక్ వీడియోని సృష్టించినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. నకిలీ వీడియోను సృష్టించిన అసలు నిందితుడి కోసం వెతుకుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మెటా సంస్థ అందించిన వివరాల ఆధారంగా నలుగురు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. దీనిపై సినీ ప్రముఖులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ మహిళా కమిషన్ ఫేక్ వీడియోలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు నోటీసు పంపింది. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించింది. దీంతో కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.