చలి చంపేస్తోంది. ఉష్ణోగ్రతలు అమాంతం తగ్గిపోవడం(Temperature Down)తో ప్రజలు గజగజ వణుకుతున్నారు. పొగమంచు, గడ్డకట్టుకుపోయే చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ(Telangana)లోనూ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చలితీవ్రత మరింత ఎక్కువగా ఉంది.
ఉదయం, సాయంత్రం వేళల్లో మంచు కురువడం సాధారణం అయినప్పటికీ శీతల గాలులు(Cold Waves) ఈశాన్యం నుంచి బలంగా వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇళ్ల నుంచి బయటికి వెళ్లాలంటే చలితో జనం వణికిపోతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
జిల్లాల్లో రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోతుండటంతో.. ఏకంగా 6.6 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. హైదరాబాద్‌లోనూ చలి తీవ్రత పెరుగుతోంది. గత వారం రోజులుగా నగరంలో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. రానున్న రోజుల్లోనూ రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.
తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్రకారం.. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా రికార్డ్ అవుతున్నాయని వెల్లడించింది. కాగా, హైదరాబాద్‌లో 11.9 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చాలా మంది రాత్రిపూట, తెల్లవారు జామున వెచ్చని దుస్తులను ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్ పాటు, తెలంగాణలోని ఆదిలాబాద్, ఇతర జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోయాయి.