కర్ణాటకలో హిజాబ్ ( Hijab)పై నిషేధాన్ని (Ban) ఎత్తివేస్తు కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ (BJP) మండిపడింది. అధికార కాంగ్రెస్ ‘విభజించు-పాలించు’ అనే బ్రిటిష్ విధానాన్ని ముందుకు తీసుకువెళుతోందని ఫైర్ అయింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య విద్యా స్థలాల “లౌకిక స్వభావం” గురించి ఆందోళన కలిగిస్తోందని బీజేపీ వెల్లడించింది.
ఢిల్లీలో మీడియా సమావేశంలో బీజేపీ కర్ణాటక చీఫ్ విజయేంద్ర మాట్లాడుతూ…. విద్యా సంస్థల్లో వాతావరణాన్ని సీఎం సిద్ధరామయ్య’ దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్య ప్రకటన చేశారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విద్యా వాతావరణాన్ని సీఎం చెడగొట్టారంటూ నిప్పులు చెరిగారు.
కనీసం ఈ చెత్త రాజకీయాల నుంచి పిల్లలనైనా తప్పించి ఉండాల్సిందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి చాలా సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికి కూడా మైనారిటీల్లో అక్షరాస్యత, ఉపాధి రేటు ఇప్పటికీ 50 శాతంగా ఉందని తెలిపారు. మైనారిటీల స్థితిగతులను మెరుగు పరచడానికి కాంగ్రెస్ ఎప్పుడూ ప్రయత్నించలేదని ఫైర్ అయ్యారు.
బ్రిటీష్ పాలకులు అవలంబించిన విభజించి పాలించు విధానాన్ని కాంగ్రెస్ విశ్వసిస్తోందన్నారు. ఆ పార్టీ బ్రిటిష్ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. విద్యాసంస్థల్లో మతపరమైన దుస్తులను అనుమతించడం ద్వారా సిద్ధరామయ్య ప్రభుత్వం యువ మనస్సులను మతపరమైన మార్గాల్లో విభజిస్తోందని, సమ్మిళిత అభ్యాస వాతావరణానికి విఘాతం కలిగిస్తోందన్నారు.
కర్ణాటకలో హిజాబ్ ధరించడంపై గత బీజేపీ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలో హిజాబ్ ధరించడంపై ఎలాంటి నిషేధం ఉండదని వెల్లడించింది. మహిళలు తమకు నచ్చిన దుస్తులు ధరించ వచ్చని, హిజాబ్ ధరించి ఎక్కడికైనా వెల్లవచ్చని సిద్దరామయ్య వెల్లడించారు.