బిహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav)కు మరోసారి షాక్ తగిలింది. ల్యాండ్ ఫర్ జాబ్ కేసు (Land For Jobs scam case)లో తాజాగా ఆయనకు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. జనవరి 5న ఈడీ విచారణకు హాజరు కావాలని తేజస్వీ యాదవ్ ను ఈడీ ఆదేశించింది. అంతకు ముందు గత నెలలో ఆయనకు ఈడీ సమన్లు పంపింది.
డిసెంబర్ 22న ఈడీ విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈడీ విచారణకు తేజస్వీ గైర్హాజరయ్యారు. ఈడీ నోటీసులు అనేవి రొటీన్ వ్యవహారమని ఆయన పేర్కొన్నారు. గతంలో కూడా ఈడీ, సీబీఐ, ఐటీ దర్యాప్తు సంస్థలు తనను ఎన్నో సార్లు విచారణకు పిలిచాయని తెలిపారు. ఇందులో కొత్త విషయమేమీ లేదని ఆయన అన్నారు.
కాషాయ పార్టీ ఆదేశాల మేరకే తనకు ఈ నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. గతంలో తాను ప్రతిసారి సక్రమంగా విచారణకు హాజరయ్యానన్నారు. కానీ ఇప్పుడు అది రొటీన్ గా మారిందన్నారు. మరోవైపు ఇటీవల తేజస్వీ తండ్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు కూడా ఈడీ నోటీసులు పంపింది. ఈ నెల 27న ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
ఈ క్రమంలో బీజేపీపై లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. పలువురు నేతలకు ఈడీ సమన్లు పంపిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకే దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే దర్యాప్తు సంస్థలు మళ్లి తమ పనులు మొదలు పెడతాయని తాను గతంలోనే చెప్పానన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఏం జరుగుతుందో మీరే చూస్తారన్నారు.