Telugu News » KTR : రెక్కల కష్టంతో నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బ తీస్తే సహించబోం….!

KTR : రెక్కల కష్టంతో నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బ తీస్తే సహించబోం….!

బీఆర్ఎస్ సర్కార్ హయాంలో తెలంగాణలో జరిగిన ప్రగతి ప్రస్థానాన్ని ‘స్వేదపత్రం’ పేరిట తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.

by Ramu
brs working president ktr released sweda patram says about government debts

-రాష్ట్ర ప్రగతి ప్రస్థానం ఒక సువర్ణ అధ్యాయం
-బీఆర్ఎస్‌ను బద్నాం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నం
-శ్వేత పత్రం పేరిట అంకెల గారడీ
-అప్పులు అంటూ అభాండాలు
-చివరకు సర్కార్ పారిపోయింది
-ఆ మూడు రకాల అప్పులు ప్రభుత్వానివి కాదు
-విధ్వంసం నుంచి వికాసం వైపు
-సంక్షోభం నుంచి సమృద్ధి వైపు ప్రయాణించాం
-ఈ పదేండ్లలో ఏం జరిగిందో అందరికీ తెలియాలి
– ప్రగతి ప్రస్థానాన్ని వివరించాల్సిన బాధ్యత మాపై ఉంది
-స్వేద పత్రాన్ని విడుదల చేసిన కేటీఆర్

తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం అనేది దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయమని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పాలనపై కాంగ్రెస్‌ ప్రభుత్వం బురదజల్లేందుకు ప్రయత్నించిందని మండిపడ్డారు. రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బ తీస్తే సహించబోమని కేటీఆర్ హెచ్చరించారు.

brs working president ktr released sweda patram says about government debts

బీఆర్ఎస్ సర్కార్ హయాంలో తెలంగాణలో జరిగిన ప్రగతి ప్రస్థానాన్ని ‘స్వేదపత్రం’ పేరిట తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ….. .తెలంగాణ రాష్ట్రం సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు స్వేద పత్రం విడుదల చేస్తున్నట్టు తెలిపారు. గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరిస్తున్నామన్నారు.

ఈ పదేండ్ల కాలంలో తమ ప్రభుత్వం చమటోడ్చి, రక్తాన్ని రంగరించి వందల గంటలు పనిచేసి, లక్షలాది మంది ఉద్యోగులు, కోట్ల మంది ప్రజలు తమ స్వేదంతో ఈ రాష్ట్ర అభ్యున్నతికి ఏ విధంగా తోడ్పడ్డారనే విషయం స్వేద పత్రం రూపంలో ముందు ఉందన్నారు. రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లారో ఈ స్వేద పత్రం ద్వారా చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.

రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బీఆర్‌ఎస్‌ను, గత పదేండ్ల కేసీఆర్‌ పాలనను బద్నాం చేసే విధంగా ప్రజల్లో అపోహలు, అనుమానాలు కాంగ్రెస్ సర్కార్ సృష్టిస్తోందన్నారు. గత బీఆరఎస్ సర్కార్ పై బురదజల్లే ప్రయత్నం చేసిందన్నారు. చివరకు శ్వేత పత్రాలంటూ హడావుడి చేసి చివరికి వాయిదా వేసుకుని సర్కార్ పారిపోయిందన్నారు.

అప్పుల పేరుతో తమపై అభాండాలు వేసిందని, శ్వేతపత్రం పేరుతో అంకెల గారడీ చేసిందని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం లేవనెత్తిన కొన్ని సందేహాలు, చేసిన ఆరోపణలపై బాధ్యత గల పార్టీగా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. గత పదేండ్లలో ప్రజలు తమకు అధికారం ఇచ్చినప్పుడు ఏం జరిగింది ? ఎట్లా జరిగింది ? అనే విషయాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అందుకే స్వేదపత్రాన్ని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.

శ్వేతపత్రంలో కాంగ్రెస్ చెప్పిన లెక్కల ప్రకారం ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి తెలంగాణ అప్పులు రూ.3,89,673 కోట్లు ఉన్నాయి. అంతకు ముందు కాంగ్రెస్ సర్కార్ తమకు ఇచ్చిన అప్పులు72,658 కోట్లు అని చెప్పారు. స్థూలంగా తమ ప్రభుత్వం 3,17,015 కోట్లు మాత్రమే అప్పుగా తెచ్చిందన్నారు. ఈ అప్పు మొత్తాన్ని వాళ్లు రూ.6.71 లక్షల కోట్లుగా చూపించారన్నారు.

కానీ రాష్ట్రంలో ప్రభుత్వ గ్యారంటీ ఉన్న రూ.1,27,208 కోట్లు ఎస్పీవీ అప్పులు , రూ.1,18,557 కోట్లు ఎస్పీవీ రుణాలు, మరో రూ.59,414 కోట్లు ప్రభుత్వ హామీ లేని రుణాలు ఉన్నాయన్నారు. ఈ మూడు రకాల రుణాలు ప్రభుత్వ అప్పులు కావన్నారు. కానీ, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కార్ రూ.3,17,015 కోట్ల అప్పులకు పైన చెప్పిన మూడు రకాల అప్పులను కూడా జతచేసిందన్నారు. దీంతో కేసీఆర్ ప్రభుత్వం మొత్తం రూ.6,71,757 కోట్ల అప్పులు తీసుకున్నట్టుగా చూపించిందన్నారు. తాము దిగిపోయే నాటికి ఉన్న అప్పు కేవలం రూ.3,17,015 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం రూ.6.71 లక్షల కోట్లుగా చెప్పడం శుద్ధ అబద్ధమని ధ్వజమెత్తారు.

వాస్తవానికి బీఆర్ఎస్‌ హయాంలో రాష్ట్రంలో పేదరికం చాలా వరకు తగ్గిందన్నారు. ఎన్ఎఫ్ హెచ్ఎస్ ప్రకారం…. తెలంగాణ నూతనంగా ఏర్పడే నాటికి రాష్ట్రంలో పేదరికం 21.92 శాతం ఉందన్నారు. తాము దిగిపోయే సమయానికి పేదరికం కేవలం 5.8 శాతానికి చేరిందన్నారు. దేశంలో వేరే ఏ రాష్ట్రంలోనూ ఇంత వేగంగా పేదరికం తగ్గుముఖం పట్టలేదన్నారు.

అన్ని విషయాల్లో దేశానికే తెలంగాణ దిక్సూచిగా మారిందన్నారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు నిధులు కేటాయించాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేసిందన్నారు. రాష్ట్రంలో విధ్వంసం నుంచి వికాసం వైపు, సంక్షోభం నుంచి సమృద్ధి వైపు ప్రయాణం జరిగిందన్నారు. 60 ఏండ్లలో ఓ వైపు జీవన విధ్వంసం జరిగిందన్నారు.

మరోవైపు ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యంతో మన రాష్ట్రాన్ని నాశనం చేసే ప్రయత్నం అప్పటి పాలకులు చేశారని నిప్పులు చెరిగారు. అది కాంగ్రెస్‌ పాలకులు కావొచ్చు. ఇతరులు కావొచ్చన్నారు. ఆనాటి ఫ్రీ లాన్స్‌ జర్నలిస్ట్‌ ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం నుంచి ప్రేరణ పొంది ‘తెలంగాణ స్టిల్‌ సీకింగ్‌ జస్టిస్‌’పేరుతో ఒక డాక్యుమెంటరీని రూపొందించారని చెప్పారు. దాన్ని చూస్తే చూస్తే కళ్లకు కట్టినట్లు అర్థమవుతుందన్నారు. ఆ డాక్యుమంటరీని ఈ సందర్బంగా ప్రదర్శించారు.

You may also like

Leave a Comment