Telugu News » Praja Palana : ఈ నెల 28 నుంచి ప్రజాపాలన… !

Praja Palana : ఈ నెల 28 నుంచి ప్రజాపాలన… !

డిసెంబర్ 28 నుంచి వచ్చే ఏడాది జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

by Ramu
cm revanth reddy says prajapalana program starts from december 28th in telangana

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ సదస్సులకు ‘ప్రజాపాలన’ (Praja Palana) అని పేరు మార్చారు. డిసెంబర్ 28 నుంచి వచ్చే ఏడాది జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించారు.

cm revanth reddy says prajapalana program starts from december 28th in telangana

ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దడంతో పాటు తాము ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలు, యంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ నెల 28 నుంచి అన్ని గ్రామాలు, మున్సిపల్‌ వార్డుల్లో ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని చేపడతారని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపల్‌ వార్డుల్లో అధికారులు బృందాలు పర్యటిస్తాయని పేర్కొంది.

రోజుకు రెండు బృందాలు చొప్పున పర్యటన చేస్తాయని వెల్లడించింది. ప్రజాపాలన కార్యక్రమానికి సర్పంచ్‌, స్థానిక కార్పొరేటర్‌, కౌన్సిలర్లను ఆహ్వానించనున్నారు. దీంతో పాటు సంబంధిత ప్రజా ప్రతినిధులందరూ విధిగా పాల్గొనేలా చర్యలు తీసుకోనున్నారు. గ్రామ సభల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రత్యేకంగా పరిశీలించేందుకు ఒక్కోదానికి ప్రత్యేకమైన నెంబర్‌ ఇచ్చి వాటిని కంప్యూటరైజ్‌ చేయనున్నారు.

సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు అట్టడుగు వర్గాల ప్రజలకు అందాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లాగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. సచివాలయం స్థాయిలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, గ్యారంటీలను అమలు చేసేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్లు, గ్రామ స్థాయి వరకు అంతా సమిష్టి కృషి చేయాలన్నారు.

వారిలో ఏ ఒక్కరు వెనుకబడినా ఆ మేరకు తేడాలు కనిపిస్తాయని చెప్పారు. ఆరు గ్యారంటీల అమలు విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. నిస్సహాయులకు సాయం అందాలన్నారు. అభివృద్ధి అంటే కేవలం అద్దాల మేడలు, రాజుల గోడలు మాత్రమే కాదన్నారు. ప్రజలకు ప్రయోజనం కలిగినప్పుడు అట్టడుగు వారికి ప్రభుత్వం నుంచి సంక్షేమం అందినప్పుడే సార్ధకమవుతుందన్న అంబేద్కర్ మాటలను ఆయన గుర్తు చేశారు.

గతంలో ఐఏఎస్ అధికారి ఎస్సార్ శంకరన్ దీన్ని దృష్టిలో పెట్టుకునే ఉదయం 9 గంటలకు సచివాలయానికి వచ్చే వారిని తెలిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల బాధలకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించి తన వంతు కృషి చేశారని గుర్తుచేశారు. ఆయన బాధ్యతను, కృషిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ఇచ్చిందన్నారు.

కానీ దాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించారన్నారు. చాలా నమ్మకంతో, విశ్వాసంతో, ధీమాతో ప్రభుత్వం అభయహస్తం కార్యక్రమాన్ని అమలుచేసే బాధ్యత అప్పజెప్తున్నదన్నారు. అందువల్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరగాలన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు రిపీట్ కావద్దన్నారు. ప్రజల్లో కలిసిపోయి పనిచేస్తూ శభాష్ అని అనిపించుకోవాలన్నారు.

ఉద్యోగులకు, అధికారులకు ప్రభుత్వం ఫ్రెండ్లీగా ఉంటుందన్నారు. ఒక వేళ ఉద్దేశపూర్వకంగా ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తప్పకుండా సమీక్షించి తగిన నిర్ణయాలు తీసుకుంటుందని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యేక నేపథ్యం ఉన్నదన్నారు. ఎన్నో ఆకాంక్షలతో ప్రాణాలను సైతం పణంగా పెట్టి చాలా మంది ఉద్యమంలోకి దూకారని తెలిపారు. ఆ ఆకాంక్షలను నెరవేర్చడం కోసం అధికారులు మానవీయ కోణంలో వ్యవహరించాలన్నారు. వారి మనసుల్ని గెల్చుకోవాలన్నారు. వారి బాధలను తెలుసుకుని పరిష్కారం చూపాలన్నారు.

You may also like

Leave a Comment