హైదరాబాద్(Hyderabad)మహానగర ప్రజలకు మౌలికసదుపాయలు కల్పించడంలో జీహెచ్ఎంసీ(GHMC) కి నిత్యం తిప్పలు తప్పడంలేదు. ఉద్యోగుల జీతాల చెల్లింపులకే నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు(Contractors) ఏడాది నుంచి జీహెచ్ఎంసీ బిల్లులు చెల్లించకపోవడంతో వారు పూర్తిగా పనులు నిలిపేశారు. కొత్త టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రావడంలేదు.
ప్రస్తుతం జీహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు వాపోతున్నారు. ఇప్పటివరకు శాఖల వారీగా పెండింగ్ బిల్లుల వివరాలను మరోసారి అధికారుల నుంచి సేకరించి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపుతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి సీఎం రేవంత్రెడ్డి త్వరలోనే జీహెచ్ఎంసీపై ప్రత్యేకంగా సమీక్ష చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
జీహెచ్ఎంసీలోని 6 సర్కిళ్లలో దాదాపు రూ.1100 కోట్లకుపైగా కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. గతంలో బకాయిల కోసం కాంట్రాక్టర్లు ధర్నా చేస్తే రూ.300 కోట్ల వరకు విడుదల చేశారు. తాజాగా కాలనీల్లో పూర్తి చేసిన పనులకు రూ.700 కోట్లు, రెండు పడక గదుల ఇళ్లకు రూ.400 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. రోడ్లు, డ్రైనేజీలు, నాలాలు ఇతరత్రా పనులకు బల్దియా ఏటా బడ్డెట్లో దాదాపు రూ.500 కోట్ల నిధులు కేటాయిస్తోంది. 10నెలలగా బకాయిలు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు అధికారులపై ఒత్తిడి పెంచారు.
బ్యాంకు ద్వారా ట్రేడ్స్ విధానంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని నిర్ణయించింది. బిల్లు మంజూరైన నాటి నుంచి నిధులు విడుదల చేసే రోజువరకు 7.7 శాతం వడ్డీని మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని కాంట్రాక్టర్ల ఖాతాలో జమ చేయాలని ప్రతిపాదించింది. అయితే ఈ విధానంపై కాంట్రాక్టర్లు తీవ్రంగా మండిపడుతున్నారు. బడ్జెట్లో పనులకు నిధులు కేటాయించి పనులు చేశాక బిల్లులపై ఆంక్షలు విధించడం గుత్తేదారుల వ్యవస్థను నీరుగార్చడమేనని వాపోతున్నారు.