దేశవ్యాప్తంగా చలి తీవ్రత(Cold intensity) పెరుగుతోంది. వారం రోజులుగా చలి క్రమక్రమంగా పెరుగుతూ ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఒక్కసారిగా చలిగాలులు(Cold Winds) వీస్తుండడంతో ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. మరోవైపు పొగమంచు(Fog) కమ్మేయడంతో వాహనాలు, రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.
పొగమంచు కారణంగా ఢిల్లీ మొత్తం తెల్లటి పొగమంచు కమ్ముకుంది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాత్రి నుంచి దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు 50కి పైగా విమానాలు ఆలస్యంగా రాగా, ఈ సమయంలో 12 విమానాల రూట్లను దారి మళ్లించారు. 11 విమానాలను జైపూర్‌నకు, ఒక విమానాన్ని లక్నోకు మళ్లించారు.
తెలంగాణలోనూ చలితీవ్రత అమాంతం పెరిగింది. పొగమంచు కారణంగా ఎఫెక్ట్ శంషాబాద్ విమానాశ్రయంపై పడింది. దీంతో విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. రాజీవ్‌గాంధీ విమానాశ్రయానికి వచ్చిన పలు విమానాలను అధికారులు దారి మళ్లించారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ముంబయి చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చింది. ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో తిరిగి చెన్నైకి మళ్లించారు.
ఈ సీజన్ మొదటిసారిగా బుధవారం అనేక ప్రాంతాల్లో జీరో విజిబిలిటీ కనిపించింది. దట్టమైన పొగమంచు ట్రాఫిక్‌పై ఎక్కువగా ప్రభావం చూపుతోంది. దీంతో రైళ్ల రాకపోకలు, విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది. రైళ్లు గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తుండగా, పలు విమానాల మార్గాలు దారి మళ్లిస్తున్నారు. శీతాకాలం దృష్ట్యా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.