అయోధ్య (Ayodhya) రామ మందిరంలో జనవరి 22న ‘రామ్ లల్లా’(Ram Lalla) విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయానికి సంబంధించి పలు విషయాలను శ్రీ రామ క్షేత్ర తీర్థ ట్రస్టు వెల్లడించింది. ఆలయంలో తెల్లటి మకర్న పాలరాయితో నిర్మించిన 51 అంగుళాల రామ్ లల్లా(బాలుడి రూపంలో ఉన్న రాముడు) విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్టు పేర్కొంది.
ఐదేండ్ల వయసు ఉన్న రాముడి కోసం ప్రస్తుతం మూడు డిజైన్లు రూపొందించామని ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. వాటిలో అత్యుత్తమ దివ్యత్వం, బాల రూపాన్ని ప్రదర్శించేలా ఉండే డిజైన్ ను ఎంపిక చేస్తామన్నారు.ఆలయ నిర్మాణంలో మొత్తం 21-22 లక్షల క్యూబిక్ అడుగుల రాయిని ఉపయోగించామ్నారు. ఈ వందేండ్లలో ఇంత పెద్ద రాతి కట్టడాన్ని ఉత్తర భారత్ లో ఎక్కడా నిర్మించలేదన్నారు.
ఇంజనీర్లు ప్రత్యేకంగా సృష్టించబడిన 56 పొరల కృత్రిమ రాయిని పునాది నిర్మాణానికి ఉపయోగించామన్నారు. కర్నాటక, తెలంగాణకు చెందిన 17000 గ్రానైట్ బ్లాకులతో కూడిన ఒక పునాది భూమి నుండి 21 అడుగుల వరకు వేశామన్నారు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ నుంచి తీసుకు వచ్చిన సుమారు ఐదు లక్షల క్యూబిక్ అడుగుల పింక్ కలర్ ఇసుకరాయిని ఆలయ నిర్మాణం కోసం ఉపయోగించామని వెల్లడించారు. ఆలయ గర్భగుడిని స్వచ్ఛమైన తెల్లని మక్రానా పాలరాతితో నిర్మిస్తున్నామన్నారు.
ఆలయ నిర్మాణంలో 392 పిల్లర్లు, 44 తలుపులు ఉన్నాయన్నారు. జీ ప్లస్ 2 పద్ధతిలో ఆలయ నిర్మాణం ఉందన్నారు. ప్రతి అంతస్తు ఎత్తు 20 అడుగులు ఉంటుందన్నారు. ఆలయ అవసరాల కోసం ప్రత్యేక నీటి శుద్ధీకరణ ప్లాంట్ లు ఏర్పాటు చేశామన్నారు. సొంత డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థ, నీళ్ల కోసం అండర్ గ్రౌండ్ రిజర్వాయర్ ఏర్పాటు చేశామన్నారు. ఆలయ కాంప్లెక్స్‌లో రెండు మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్‌లు, ఒక వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
20 ఎకరాల్లో ఆలయ నిర్మాణం చేపట్టామన్నారు. 50 ఎకరాల్లో పచ్చదనం పెంపొందిస్తున్నామన్నారు. అయోధ్యలోని రామ మందిర పరిసరాలు ఎక్కువ భాగం పచ్చదనంతో నిండి ఉంటాయన్నారు. 70 ఎకరాల్లో 70 శాతం చెట్లు, మొక్కలతోనే విస్తరించి ఉంటుందన్నారు. ఇందుకోసం 600 చెట్లను గ్రీన్ బెల్ట్‌లో సంరక్షిస్తున్నామని వివరించారు.
అయోధ్య ఆలయం దీర్ఘ చతురస్ర ఆకారంలో చుట్టుకొలత కలిగి ఉంటుంది. సాధారణంగా ఇలాంటి ఆలయాలు ఎక్కువగా దక్షిణ భారత్ లో మనకు కనిపిస్తాయి. దీర్ఘచతురస్ర ఆకారంలో ఒక్కో మూలన సూర్యుడు, మా భగవతి, గణేష్, శివునికి అంకితమివ్వనున్నారు. ఇక ఉత్తరాన అన్నపూర్ణ ఆలయం, దక్షిణాన హనుమంతుడి ఆలయాలు ఉండనున్నాయి. ఆలయ కాంప్లెక్స్‌లో మరో ఏడు గుడులు ఉంటాయి.