వైసీపీ(YCP)లో సీట్ల మార్పులు చేర్పులపై వైఎస్ఆర్(YSR) కాంగ్రెస్ పార్టీ(Congress Party) రీజినల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ చేరుకున్న ఆయనకు ఎయిర్‌పోర్టులో పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు.
పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా తమకేం ఇబ్బంది లేదన్నారు. ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం 175 సీట్లకు 175సీట్లను టార్గెట్‌గా పెట్టుకుందని వెల్లడించారు. అందులో భాగంగానే సీట్లలో మార్పులు చేపట్టినట్లు స్పష్టం చేశారు. అయితే, వైసీపీలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా రాజీనామా చేసి వెళ్తున్నారంటే దానికి వారే సమాధానం చెప్పాలన్నారు.
సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని చూసి మళ్లీ ప్రజలు ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉందన్నారు. ఎక్కడైతే పార్టీ పరిస్థితి బాగోలేదో అక్కడ ఇన్‌చార్జిలను మార్చామని తెలిపారు. ఎంతమంది నాయకులు ఉన్నా బీసీలకు న్యాయం చేయాలని పట్టుబట్టి వంశీకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చామని, కానీ ఆయన పార్టీని వీడారని తెలిపారు.
ఇక, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తమ నాయకుడు వైఎస్ జగన్‌కు తిరుగులేదన్నారు. జనవరి నెలకి బస్సుయాత్ర ముగింపు దిశగా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కోర్టు పరిధిలో ఉన్న ఇబ్బందులు వల్లే రాజధాని మార్చడం ఆలస్యమైందని తెలిపారు. విశాఖ నుంచే పాలన సాగుతుందని మరోసారి స్పష్టం చేశారు.