ఎన్నికల్లో వైసీపీ(YCP) గెలుపునకు వైఎస్సార్, జగన్ ఫొటోలు చాలని మంత్రి(Minister) ఆదిమూలపు సురేష్(Aadimulapu Suresh) అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లా(Prakasham District) లో మార్పులపై విజయసాయిరెడ్డి, బాలినేని కసరత్తు చేస్తున్నారని తెలిపారు.
ఒకటి రెండు రోజుల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొత్త సమన్వయకర్తలను ప్రకటించే అవకాశముందన్నారు. 175 నియోజకవర్గాల్లో ఎవరైనా సరే సీఎం జగన్, వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోలతో గెలవాల్సిందేని మంత్రి అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం ఎందుకు మారారో.. ఎన్టీఆర్, బాలకృష్ణ హిందూపూర్ నుంచి ఎందుకు పోటీ చేశారో సమాధానం చెప్పాలి అని మంత్రి ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు.
పార్టీలో మార్పులు సహజమని, అలాంటి వాటిపై టీడీపీ అనవసరమై రాద్దాంతం చేస్తోందని మంత్రి సురేష్ మండిపడ్డారు. పార్టీ 175 స్థానాల్లో విజయం సాధించాలంటే తప్పకుండా తగిన గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి అందులో భాగంగానే ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయని తెలిపారు.
కొండెపిలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని, అధిష్టానం నిర్ణయం ప్రకారం అందరూ కలిసికట్టుగా పని చేస్తామని తెలిపారు. అధిష్టానం నిర్ణయం వెనుక అనేక కారణాలు, వ్యూహాలు ఉంటాయన్నారు. గత ఎన్నికల్లో ఎస్సీ నియోజకవర్గాల్లో కొండెపి ఒక్క చోటే వైసీపీ ఓటమి పాలైంది అని ఆయన చెప్పుకొచ్చారు. ఈసారి కొండెపిలో వైసీపీ జెండా ఎగరేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.