అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అయోధ్యకు చేరుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా అయోధ్యకు ప్రత్యేక విమానాలు, రైళ్లు నడుపేందుకు కేంద్ర సర్కార్ సన్నద్ధమైంది. ఈ మేరకు అయోధ్యలో నిర్మించిన కొత్త విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ను ప్రధాని మోడీ ఇవాళ(డిసెంబర్ 30) మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభించనున్నారు.
అయోధ్యలోని ఈ విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్‌గా నామకరణం చేశారు. విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముందు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ శుక్రవారం(డిసెంబర్ 29) దేశంలోని మూడు నగరాల నుంచి అయోధ్యకు నేరుగా విమానాలను నడపనున్నట్లు ప్రకటించింది.
అదేవిధంగా జనవరి 17, 2024 నుంచి బెంగళూరు- కోల్‌కతా మధ్య అయోధ్యకు నేరుగా విమానాలు నడుపనున్నట్లు విమానయాన సంస్థలు తెలిపాయి. ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అంకుర్ గార్గ్ మాట్లాడుతూ – దేశంలోని ప్రతి ప్రాంతానికి విమాన సేవలను అందించడానికి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం పగలు, రాత్రి నిరంతరం శ్రమిస్తున్నామన్నారు.
అయోధ్యకు విమానాల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని, దేశంలోని మూడు ప్రధాన నగరాలు అంటే ఢిల్లీ, కోల్‌కతా, బెంళూరు నుంచి నేరుగా విమానాలను నడపాలని నిర్ణయించామన్నారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ జనవరి 30 నుంచి ఢిల్లీ-అయోధ్య మధ్య డైరెక్ట్ విమానాలు నడుపనుంది. బెంగళూరు–అయోధ్య నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ జనవరి 17న ఉదయం 8.05 గంటలకు మొదటి విమానం నడుస్తుంది. ఇది ఉదయం 10.35 గంటలకు అయోధ్యకు చేరుకుంటుందని తెలిపింది.
తిరిగి అయోధ్య నుంచి మధ్యాహ్నం 3.40గంటలకు బయల్దేరి సాయంత్రం 6.10గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది. అదేవిధంగా అయోధ్య నుంచి తొలి విమానం జనవరి 17న ఉదయం 11.05గంటలకు బయల్దేరుతుంది. మధ్యహ్నం 12.50గంటలకు కోల్‌కతా చేరుకుని అక్కడి నుంచి మధ్యాహ్నం 1.25గంటలకు బయల్దేరి 3.10గంటలకు అయోధ్య చేరుకుంటుంది.