దేశ వ్యాప్తంగా ప్రజలు నూతన సంవత్సరా (New Year)నికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కొత్త సంవత్సరంలో ప్రజలందిరికీ మంచి జరగాలని భక్తులు (Devotees) ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొత్త సంవత్సరం వేళ ఉదయం 1.40 గంటల నుంచే ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి.
ఉదయం 2 గంటల నుంచి ఇప్పటి వరకు లక్ష మందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి న్యూ ఇయర్ రోజు భారీ సంఖ్యలో భక్తులు వచ్చినట్టు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీలోని జందేవాలన్ దేవీ ఆలయంలో పెద్ద సంఖ్యలు భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి వారిని వేడుకున్నారు. అదేవిధంగా శ్రీశైలం మల్లన్న క్షేత్రం, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం, జమ్మూ కశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయం, మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా దేవస్థానం, హరిద్వారా, తమిళనాడులోని మధురైలో గల మీనాక్షి అమ్మవారి ఆలయం, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలకు భక్తులతో కిక్కిరిశాయి.
అటు ఆగ్రాలో తాజ్ మహల్ అందాలను భారీ సంఖ్యలో పర్యాటకులు వీక్షించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జమ్ము కశ్మీర్ లోని లాల్ చౌక్ వద్ద ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు నిర్వ హించారు. కొత్త సంవత్సరాన్ని పురష్కరించుకొని వారణాసి, అయోధ్యలో తెల్లవారు జామునే తొలి గంగా హారతి, సూర్య పూజ నిర్వహించారు. భక్తులు పవిత్ర నదీ స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు.