అమెరికా, దక్షిణ కొరియాను నాశనం చేస్తామని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ఇదే సమయంలో సౌత్ కొరియా (South Korea) ప్రతిపక్ష నేత, అధ్యక్ష అభ్యర్థి లీ జే మ్యూంగ్ (Lee Jae Myung) పై దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. మంగళవారం ఉదయం బుసాన్ (Busan) లో ఆయన పర్యటించారు. నిర్మాణంలో ఉన్న ఎయిర్ పోర్ట్ పనులను పరిశీలించారు.
ఎయిర్ పోర్ట్ పనులను పరిశీలించాక మీడియాతో మాట్లాడారు మ్యూంగ్. అదే సమయంలో దుండగుడు ఒక్కసారిగా ఆయన మెడపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడున్నవారు ఆస్పత్రికి తరలించారు. దాడి అనంతరం నిందితుడు పారిపోతుండగా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. 20 నుంచి 30 ఇంచుల పొడవున్న కత్తితో దాడి జరిగింది.
ఆస్పత్రికి తరలించేటప్పుడు మ్యూంగ్ స్పృహలోనే ఉన్నారు. దీనిపై డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఎంపీ క్వాన్ చిల్ సీయుంగ్ మాట్లాడుతూ.. ఇలాంటివి ప్రజాస్వామ్యానికి ముప్పుగా చెప్పారు. దీన్ని అందరూ ఖండించాలని కోరారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. అందులో దాడికి ముందు లీ జే మ్యూగ్ క్యాప్ తో కనిపించాడు నిందితుడు. ఆయన మద్దతుదారుడిగా అక్కడకు వచ్చి దాడికి పాల్పడ్డాడు.
2022 ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ చేతిలో మ్యూంగ్ ఓడిపోయారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గత సెప్టెంబర్ లో 24 రోజులపాటు నిరసన దీక్ష చేశారు.