నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అవినీతికి కేంద్రంలోని బీజేపీ (BJP) సర్కార్ పూర్తిగా మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో నిబంధలను మార్చి మరి ఆ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇప్పించిందని ఆరోపణలు గుప్పించారు. రెండు పార్టీల మధ్య ఒప్పందం లేకుంటే ప్రాజెక్ట్ లో ఇన్ని సమస్యలు బయటపడుతున్నా వాటిపై కేంద్రం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
కాళేశ్వరంలో అవినీతి గురించి పార్లమెంట్లో చాలా సార్లు ప్రస్తావించామని చెప్పారు. వారం రోజుల్లో కాళేశ్వరంపై జ్యుడిషియల్ విచారణ జరిపిస్తామన్నారు. ప్రాజెక్టు విషయంలో ఎవరు తప్పు చేసినా వారిని ఉపేక్షించేదిలేదని వెల్లడించారు. బీఆర్ఎస్, బీజేపీ విధానాల వల్లే రాష్ట్రంపై భారీగా అప్పుల భారం పడిందన్నారు. పదేండ్ల పాటు బీఆర్ఎస్, బీజేపీలు కలిసే పని చేశాయని ఆరోపణలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు కేంద్ర ఆధీనంలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణం ఇచ్చిందని గుర్తు చేశారు. ఏ రాష్ట్రంలోనూ ప్రాజెక్టులకు ఆ సంస్థ రుణాలు ఇవ్వలేదన్నారు. కేవలం విద్యుత్ రంగ ప్రాజెక్టులకు మాత్రమే ఆ సంస్థ రుణాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కానీ ఆ సంస్థ కాళేశ్వరానికి ఎందుకు రుణం ఇచ్చిందని నిలదీశారు. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రూ.లక్ష కోట్లు రుణాలు తీసుకున్నా కేంద్రం పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకత, అవినీతిరహిత పాలనకు కట్టుబడి ఉంటుందన్నారు. రీ డిజైన్లను, అదనపు అంచనాలను కేంద్రం ఎందుకు అంగీకరించిందని అనుమానం వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డి మూడు నెలలుగా మేడిగడ్డను ఎందుకు పరిశీలించలేది నిలదీశారు. మేడిగడ్డ బ్యారేజీపై కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీబీఐ విచారణకు జరిపించాలని కిషన్‌రెడ్డి ఎందుకు అడగలేదని ప్రశ్నల వర్షం కురిపించారు.
కర్ణాటక, ఢిల్లీ, పంజాబ్‌లో సీబీఐ విచారణకు అక్కడి ప్రభుత్వాల నుంచి అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించారు. విపక్ష ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలపైకి సీబీఐ, ఈడీని పంపే కేంద్రం మరి మాజీ సీఎం కేసీఆర్‌పై ఎందుకు విచారణ జరపలేదన్నానరు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవిత ఎందుకు అరెస్టు కాలేదని చెప్పాలన్నారు.