Telugu News » Telangana : పీఎం విశ్వకర్మ.. తెలంగాణలో నిర్లక్ష్యం..!

Telangana : పీఎం విశ్వకర్మ.. తెలంగాణలో నిర్లక్ష్యం..!

తమది ప్రజా పాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్.. కేసీఆర్ మాదిరి కాకుండా కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రజలకు అందేలా చూడాలని జనం అడుగుతున్నారు.

by admin
special-story-on-pm-vishwakarma-scheme

– తెలంగాణలో పీఎం విశ్వకర్మ అమలవుతుందా?
– క్షేత్రస్థాయిలో అంతా నిర్లక్ష్యం జరుగుతోందా?
– బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగింది..?
– బీజేపీ నేతలు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారా?
– కాంగ్రెస్ హయాంలోనైనా అందరికీ లబ్ధి జరుగుతుందా?

భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవి. పురాతన కాలం నుంచి ఇవి వారసత్వంగా కొనసాగుతున్నవి. అలాగే, చేతి వృత్తి పనులు కూడా అంతే. భారతదేశానికే ఒక ప్రత్యేక గుర్తింపును ఇవి తెచ్చి పెడుతున్నాయి. కానీ, మారుతున్న కాలంలో చాలా చేతి వృత్తి పనులు కనుమరుగవుతున్నాయి. దీన్ని గుర్తించిన కేంద్రంలోని మోడీ సర్కార్.. మన సంప్రదాయ కళావృత్తుల వారి కోసం ‘పీఎం విశ్వకర్మ’ అనే పథకాన్ని తీసుకొచ్చింది. అయితే.. ఈ పథకం అమలు కిందిస్థాయిలో సరిగ్గా జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ప్రజలకు అవగాహన కల్పించడంలో రాష్ట్ర బీజేపీ నేతలు విఫలం అవుతున్నారని అనుకుంటున్నారు.

special-story-on-pm-vishwakarma-scheme

ఈ పథకం లక్ష్యం ఏంటి?

2023 సెప్టెంబర్ 17న పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించారు. వారసత్వ పరంపరను ప్రోత్సహించడం.. సంప్రదాయ పనిముట్లను, చేతి వృత్తి కళాకారులు, కుటుంబ ఆధారిత వృత్తులను బలోపేతం చేయడం.. ఈ పథకం ముఖ్య లక్ష్యం. చేతిపనుల వారు, కళాకారులు చేసే ఉత్పత్తుల నాణ్యతను పెంచడం, వారిని దేశీయ, గ్లోబల్ మార్కెట్‌ తో అనుసంధానించడం ఈ పథకం వెనుక ఉన్న మరో ఉద్దేశం. ఇందులో రెండు రకాల స్కిల్లింగ్ కార్యక్రమాలు ఉంటాయి. వీటిల్లో శిక్షణ పొందుతున్నప్పుడు లబ్ధిదారులకు రోజుకు రూ.500 స్టైఫండ్ అందిస్తారు. ఆసక్తి కలిగిన వారు 15 రోజుల అధునాతన శిక్షణ కోసం నమోదు చేసుకోవచ్చు.

ప్రయోజనాలు ఏంటి?

ఈ పథకం నాయీ బ్రాహ్మణులు, చర్మకారులు, కమ్మరి, కుమ్మరి, ఇతర కులవృత్తుల వారికి నైపుణ్య శిక్షణ, అవసరమైన ఆధునిక పనిముట్లను కొనుక్కోవడం కోసం రూ.15 వేల వరకు ఉచితంగా ఆర్థిక సహాయం అందుతుంది. అలాగే రూ.లక్ష వరకు ఈ పథకం కింద తక్కువ వడ్డీతో రుణం కూడా అందుతుంది. రెండో విడతలో రూ.2 లక్షల వరకు రుణం ఇస్తారు. వృత్తి కళాకారులు తయారుచేసిన ఉత్పత్తుల మార్కెటింగ్ విషయంలో కూడా ప్రభుత్వం నుంచి సహాయం ఉంటుంది. ఈ పథకం ద్వారా తొలి ఏడాది 5 లక్షల కుటుంబాలకు, అయిదేళ్లలో మొత్తం 30 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది.

కేసీఆర్ హయాంలో నిర్లక్ష్యం

పీఎం విశ్వకర్మ పథకం ద్వారా చేతివృత్తి కళాకారులకు ఎంతో ఉపయోగం ఉంది. కానీ, ఇది ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణలో అంతగా ప్రచారం జరగలేదు. సవాలక్ష నిబంధనలు ఉన్నాయి.. దాని కంటే కేసీఆర్‌ బీసీ బంధు బెస్ట్.. చేతివృత్తుల వారికి రూ.లక్ష గ్రాంటు అంటూ ప్రభుత్వ అనుకూల మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీ బంధుతో పోలిస్తే విశ్వకర్మ పథకం ఎందుకూ కొరగాదన్న వార్తలు ఇచ్చారు. లబ్ధిదారుల ఎంపికలోనూ స్పష్టత లేదని.. కేంద్రం విడుదల చేసిన జాబితాలో లేని కళలకు రుణాలు మంజూరు చేయరని కథనాలు వడ్డించారు. దీంతో పీఎం విశ్వకర్మ పథకంపై ప్రజలకు పెద్దగా తెలియలేదు.

ఇప్పటికైనా లక్ష్యం నెరవేరేనా..?

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కేసీఆర్ తెచ్చిన బీసీ బంధుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో పీఎం విశ్వకర్మ పథకం విస్తృతంగా అమలైతే లబ్ధిదారులకు ఎంతో మేలు జరుగుతుందని అనుకుంటున్నారు. ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజలకు పీఎం విశ్వకర్మ పథకంపై అవగాహన కల్పించి లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేయాలి. అప్పుడే ప్రధాని మోడీ లక్ష్యం నెరవేరుతుందని అంటున్నారు. తమది ప్రజా పాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్.. కేసీఆర్ మాదిరి కాకుండా కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రజలకు అందేలా చూడాలని జనం అడుగుతున్నారు.

You may also like

Leave a Comment