సంక్రాంతి పండుగ(Sankranti Festival)కు సొంతూరుకు వెళ్తుండగా ఊహించని ప్రమాదం ఉలిక్కిపడేలా చేసింది. జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwala District)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ క్రమంలో బస్సులో మంటలు చెలరేగడంతో ఓ మహిళ సజీవ దహనమైంది. మరో నలుగురు గాయాలపాలయ్యారు.
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా బెటాలియన్ పెట్రోల్ బంకు సమీపంలో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుంచి చిత్తూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో, ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు వివిధ మార్గాల ద్వారా బస్సులోంచి బయటకు వచ్చారు.
ఈ క్రమంలో ఓ మహిళ చెయ్యి ఇరుక్కుపోవడంతో ఆమె బయటకు రాలేకపోయినట్లు సమాచారం. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. ఈ లోపు మంటలు తీవ్రం కావడంతో ప్రయాణికుల కళ్ల ముందే సజీవ దహనమైంది. ప్రమాద సమయంలో బస్సులో 40 నుంచి 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
ప్రమాదంపై స్థానికులు అగ్నిమాపక శాఖ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బందిని మంటలను అదుపు చేశారు. బాధితులను గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరిని హైదరాబాద్ తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. బస్సు 11 గంటలకు హైదరాబాద్లోని ఆరాంఘర్ నుంచి ప్రయాణికులతో బయల్దేరిందని చెప్పారు.
డ్రైవర్ నిద్రమత్తు కారణంగా బస్సు అదుపుతప్పి బోల్తా పడిందని మాకు సమాచారం వచ్చిందని పోలీసులు తెలిపారు. వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నామని, అప్పటికే బస్సులో మంటలు చేలరేగాయని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.