కాంగ్రెస్ (Congress) నేత, కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దియోరా (Milind Deora) శివసేన (ఏక్ నాథ్ షిండే వర్గం)లో చేరారు. సీఎం ఏక్ నాథ్ షిండే సమక్షంలో మిలింద్ దియోర శివసేన కండువా కప్పుకున్నారు. మిలింద్ దియోరకు కాషాయ జెండా అందించి శివసేనలోకి ఏక్ నాథ్ షిండే ఆహ్వానించారు. ఇది తనకు చాలా భావోద్వేగకరమైన క్షణాలని దియోర వెల్లడించారు.
ఈ సందర్బంగా మిలింద్ దియోర మాట్లాడుతూ…. తాను కాంగ్రెస్ ను వీడతానని ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు. కానీ ఈ రోజు ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరేందుకు కాంగ్రెస్తో తనకు ఉన్న 55 ఏండ్ల సంబంధాన్ని వదులుకున్నానని భావోద్వేగానికి గురయ్యారు. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే అందరికీ అందుబాటులో ఉండే నేత అని కొనియాడారు.
దేశ అభివృద్ధి పట్ల ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు గొప్ప ఆలోచనలు కలిగి వున్నారని అన్నారు. అందుకే వారితో కలిసి ముందుకు వెళ్లాలని అనుకుంటున్నట్టు చెప్పారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మిలింద్ దియోరా ట్వీట్ చేశారు. పార్టీతో తనకు ఉన్న 55 ఏండ్ల బంధం నేటితో ముగిసిపోయిందని ట్వీట్ లో పేర్కొన్నారు.
2014 నుంచి ముంబై దక్షిణ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మిలింద్ దియోర ఎంపీగా ఉన్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ముంబై దక్షిణ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా శివసేనకు కేటాయించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ ముంబై నియోజకవర్గం నుంచి తనకు అవకాశం లభించదని భావించిన మిలింద్ పార్టీకి రాజీనామా చేశారు.