అయోధ్యలో రామ్ లల్లా (Ram Lalla) విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాని (consecration ceremony)కి హాజరు కావాలని తనకు ఆహ్వానం అందినట్టు బీఎస్పీ చీఫ్ మాయావతి తెలిపారు. తనకు ఆహ్వానం పంపిన ట్రస్టు సభ్యులకు ఆమె కృతజ్ఞతలు చెప్పారు.
కానీ ముఖ్యమైన కార్యక్రమాల నేపథ్యంలో అయోధ్య కార్యక్రమానికి హాజరయ్యే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. బహుజన సమాజ్ వాదీ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ అని పేర్కొన్నారు. అన్ని మతాలను తమ పార్టీ గౌరవిస్తుందని వెల్లడించారు.
అది ఏ మతమైనా తమకు సమానమేనని స్పష్టం చేశారు. తమ పార్టీ ఎవరినీ వ్యతిరేకించడం లేదన్నారు. దేశంలో లౌకికవాద పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమేనన్నారు. భవిష్యత్లో బాబ్రీ మసీదుకు సంబంధించి ఇలాంటి కార్యక్రమం ఏదైనా జరిగితే అప్పుడు కూడా తమ పార్టీకి ఎలాంటి అభ్యంతరమూ ఉండబోదని స్పష్టం చేశారు.
పార్టీకి సంబంధించిన పలు ముఖ్యమైన కార్యక్రమాలతో తాను ప్రస్తుతం బిజీగా ఉన్నానని వివరించారు. అందువల్ల ఇప్పటి వరకు ఈ ఆహ్వానంపై నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ ఆహ్వానం నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ విషయాన్ని మీడియాకు వెల్లడిస్తామన్నారు.