ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha)కు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ నోటీసుల ద్వారా బీజేపీ కొత్త డ్రామాకు తెరలేపిందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala kiran kumar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారనీ.. కీలకంగా ఉన్న కవితను మాత్రం అరెస్ట్ చేయకుండా కేసునే నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారని కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తీరా లోక్సభ ఎన్నికల్లో ఓట్ల కోసం మరోసారి నోటీసుల పేరుతో డ్రామా చేస్తున్నారని ఆయన విమర్శించారు.
అయితే, కవితపై బీజేపీ చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలకు అవగాహన ఉందని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. గడిచిన తొమ్మిదినరేళ్లుగా బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఉన్న అవగాహన తెలంగాణ ప్రజలకు అర్థమైందన్నారు.
ఈ రెండు పార్టీల నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఆయన తెల్చిచెప్పారు. కాగా, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ లబ్ధి పొందేందుకే ఈడీ సమన్ల పేరిట కొత్త నాటకానికి తెరలేపారని కిరణ్ కుమార్రెడ్డి చెప్పుకొచ్చారు.