ప్రస్తుతం చెస్ క్రీడలో భారత్ అగ్రగామిగా ఉన్న సంగతి తెలిసిందే. మేథో శక్తితో ఆడే ఈ ఆటలో కొంత కాలంగా తన ప్రతిభతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద (Praggnanandhaa). ఈ క్రమంలోనే ప్రజ్ఞానంద మరో రికార్డ్ సృష్టించాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ (Viswanathan Anand Chess)ను అధిగమించి నంబర్ 1 భారత చెస్ ప్లేయర్‌గా ప్రజ్ఞానంద అవతరించాడు.
బుధవారం జరిగిన టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్ నాలుగో రౌండ్లో ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్‌ను (చైనా) ఓడించి ఈ ఘనత అందుకున్నాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్లాసికల్ చెస్ విభాగంలో వరల్డ్ ఛాంపియన్‌ను ఓడించిన రెండో భారతీయుడిగా ఈ చెస్ గ్రాండ్ మాస్టర్ రికార్డుకెక్కాడు. తన కెరీర్లో అగ్రశ్రేణి క్రీడాకారుడిగా ప్రజ్ఞానంద నిలవడం ఇదే మొదటి సారి కావడం విశేషం.
ప్రస్తుతం ఫిడే ర్యాంకింగ్స్ ప్రకారం ప్రజ్ఞానంద 2748.3 పాయింట్లతో 11వ స్థానంలో ఉన్నాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ 2748 పాయింట్లతో 12స్థానంలో కొనసాగుతున్నాడు. భారత నంబర్ వన్ ప్లేయర్ అవతరించిన ఆర్ ప్రజ్ఞానందపై అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రశంసల వర్షం కురిపించారు.
అదానీ తన ఎక్స్ ఖాతాలో ప్రజ్ఞానందపై ప్రశంసల జల్లు కురిపించారు. “అద్భుతమైన క్షణాలు.. వరల్డ్ ఛాంపియన్‌ను ఓడించి ఈ ఘనత అందుకున్నావు. నిన్ను చూసి ఈ దేశం గర్వంగా ఫీల్ అవుతోంది” అంటూ రాసుకొచ్చారు. కాగా, ప్రజ్ఞానందకు ఆర్థికంగా అండగా ఉంటామని ఈ మధ్యే అదానీ గ్రూప్ ప్రకటించింది.