ఇటీవల ప్రముఖుల సోషల్ మీడియాల ఖాతాలు హ్యాక్(Hack) అవుతుండడం కలకలం రేపుతోంది. సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) ముఖ్య రాజకీయ నేతలకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాల డీపీలను మార్చడంతో పాటు సంబంధం లేని పోస్టులు పెడుతున్నారు. రాజకీయ నాయకులతో పాటు పోలీసులను టార్గెట్ చేస్తూ ఎక్స్, ఫేస్‌బుక్, వాట్సప్ లను హ్యాక్ చేస్తున్నారు.
తాజాగా, తెలంగాణ గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) ఎక్స్(ట్విట్టర్) అకౌంట్ హ్యాక్‌కు గురైంది. ఈ విషయాన్ని రాజ్ భవన్ అధికారులు గుర్తించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ మాజీ మంత్రి కేటార్, ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫేస్‌బుక్ ఖాతాలు హ్యాక్ అయిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు తమిళిసై సౌందర రాజన్ సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ కొంతకాలంగా తమకు తెలియకుండా పోస్టింగ్ కావడంపై రాజభవన్ వర్గాలు ఆరాతీశాయి. ఎక్స్ ఖాతాను తెరిచే సమయంలో పాస్‌వర్డ్ సైతం తప్పని సూచిస్తోందని తెలిపాయి. మరోవైపు, ఈ ఖాతాలో పోస్ట్ చేయని అంశాలను కూడా సిబ్బంది గుర్తించామన్నారు. దీంతో ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయినట్లు నిర్ధారించుకున్నట్లు వెల్లడించారు.
హ్యాకింగ్ కు పాల్పడింది ఎవరు? రాజ్ భవన్ లోని వారేనా లేక ఇతరుల అనే దానిపై ఆరా తీస్తున్నారు. పాస్‌వర్డ్ కూడా తప్పు చూపిస్తుందంటే ఇది కచ్చింతంగా రాజ్ భవన్‌లోని వారే అయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ టూర్ విషయాలు ముందే తెలుసుకుని ఏమైనా చేసే ఆస్కారం ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు.