– ఆనాడు సలహాదారుల నియామకంపై ఆగ్రహం
– ఇప్పుడు ముగ్గురికి నియామక ఉత్తర్వులు
– రేవంత్ తీరుపై సర్వత్రా చర్చ
– నీతులు చెప్పడానికేనా?
రేవంత్ ప్రభుత్వం ముగ్గురు ప్రభుత్వ సలహాదారులను నియమించింది. ఈ మేరకు ఆదివారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, వేణుగోపాల్ ను ప్రభుత్వ సలహాదారులుగా నియమించింది. వేణుగోపాల్ (ప్రోటోకాల్, పబ్లిక్ రిలేషన్స్), వేం నరేందర్ రెడ్డి (సీఎం వ్యవహారాలు) షబ్బీర్ అలీ (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలు) ప్రభుత్వ సలహాదారులుగా నియమితులయ్యారు. అదేవిధంగా ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మరో సీనియర్ నేత మల్లు రవిని నియమించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారనే టాక్ వచ్చింది. కానీ, ప్రభుత్వ సలహాదారుతో సరిపెట్టారు రేవంత్. వేం నరేందర్ రెడ్డి సీఎంకు మిత్రుడు. గతంలో వీరిద్దరూ టీడీపీలో చురుగ్గా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు కేబినెట్ హోదాతో ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఇక వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. ప్రస్తుతం టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వంలో చోటు కల్పించారు.
అయితే.. సలహాదారుల నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కేసీఆర్ హయాంలో రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు గుర్తు చేస్తున్నారు కొందరు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ సలహాదారులు ఎందుకు అని రేవంత్ అన్నారని.. ఇప్పుడు సీఎం కాగానే ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి స్పందించారు. చెప్పడానికే నీతులు అన్నట్లు రేవంత్ రెడ్డి వ్యవహారశైలి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సలహాదారుల వ్యవస్థ ఉండదని అన్నారని గుర్తు చేశారు.
గతంలో రాష్ట్ర అవసరాల కోసం, పాలనలో పని తీరు మెరుగుపర్చుకోవడం కోసం రిటైర్డ్ అధికారులను సలహాదారులుగా కేసీఆర్ నియమించుకున్నారని.. కానీ, రేవంత్ ఫక్తు రాజకీయ నాయకులను నియమించుకున్నారని అన్నారు. ఆయన చెప్పేది ఒకటి చేసేది మరొకటి అంటూ ఫైరయ్యారు. ఓటుకు నోటు కేసులో సహకరించిన వారికి పదవులు ఇచ్చారని.. ఇవి వృధా నియామకాలు అంటూ ఎద్దేవ చేశారు. రాజకీయ పునరావాసం కోసమే సలహాదారులను నియమించారని ఆరోపించారు శ్రీధర్ రెడ్డి.