హైదరాబాద్లో మరోసారి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దిల్సుఖ్నగర్ (Dilsukhnagar) ఆర్టీసీ డిపో(RTC Depo)లో సోమవారం తెల్లవారుజామున రెండు బస్సులకు మంటలంటుకున్నాయి. డిపోలో నిలిపి ఉంచిన ఓ సిటీ ఎక్స్ప్రెస్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దీంతో పక్కనే ఉన్న మరో బస్సుకూ మంటలు అంటుకుని రెండు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.
అయితే ప్రమాదానికి గల కారాణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వరప్రసాద్ సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాద సమయంలో డిపోలో చాలా బస్సులు పార్కింగ్ చేసి ఉండగా మంటలు రెండు బస్సులకు పరిమితం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, బస్సులో మంటలు ఎలా అంటుకున్నాయి? ఎవరైనా నిప్పంటించారా? లేక షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా? అనేది తెలియాల్సివుంది. అయితే ఆర్టీసీ అధికారులు మాత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.