ధరణి (DHARANI) చట్టంలోనే చాలా లోపాలు ఉన్నాయని కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు, ధరణి కమిటీ సభ్యుడు కోదండ రెడ్డి (Kodanda Reddy) అన్నారు. ధరణిలో ఉన్నలోపాల వల్ల లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. 2014 వరకు రైతులకు భూముల హక్కుల విషయంలో ఎలాంటి సమస్యలు రాలేదని తెలిపారు. 2014 నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ హక్కు హరించి పోయిందని వెల్లడించారు.
సీసీఎల్ఏలో ధరణిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమీటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పోర్టల్లో లోపాలు, చేయాల్సిన సవరణలపై కమిటీ చర్చించింది. సమావేశం అనంతరం కోదండ రెడ్డి మాట్లాడుతూ…. ధరణి పోర్టల్లో లోపాల వల్ల బీఆర్ఎస్ హయాంలో చాలా మంది పేద రైతులకు రైతుబంధు సాయం అందలేదన్నారు.
‘గత ప్రభుత్వం చేసిన చట్టాల్లో అనేక లోపాలున్నాయి. వాటిని సవరించాల్సి ఉంది. ధరణిలో ఉన్న లోపాల కారణంగా లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. 2018లో ధరణి సర్క్యులర్, 2020లో చట్టాన్ని గత ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఆ తర్వాత కేబినెట్ కమిటీని ఏర్పాటు చేసింది. ధరణితో సమస్య పరిష్కారం కాలేదు’అని చెప్పారు.
‘గతంలో భూమి హక్కుల విషయంలో చట్టాలు సమర్థవంతంగా ఉన్నాయి. 2018 వరకు హక్కు పుస్తకం ఉంది. భూమి హక్కును మళ్ళీ అందిస్తాం. పటిష్టమైన రెవెన్యూ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆరేండ్లుగా లక్షలాది మంది రైతులు హక్కు పుస్తకాలు లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. రెవెన్యూ వ్యవస్థలో చిన్న ఇబ్బందులు తప్ప గతంలో హక్కులకు ఎలాంటి ఇబ్బందులు లేవు’అని వివరించారు.
‘వేల ఎకరాలు ఉన్న వారికి కూడా రైతుబందు వచ్చింది కానీ చిన్న, సన్నకారు రైతులకు రైతు బంధు రాలేదు.. భవిష్యత్లో మళ్ళీ ఇబ్బందులు రాకుండా హక్కుదారు పేరు ఆన్లైన్ లో ఉండాల్సిందే. తొందరలోనే మధ్యంతర నివేదిక ఇస్తాం. కాంగ్రెస్ సర్కార్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. భూ రికార్డులను సవరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది’అని అన్నారు.