మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy)పై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముగ్గురిని హత్య చేసిన కేసులో జగదీశ్ రెడ్డి నిందితుడని, హంతకుడని తీవ్ర ఆరోపణలు చేశారు. రేపో, మాపో జగదీశ్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమన్నారు. గత ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయి గెలిచాడన్నారు.
ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేని అసమర్థ నాయకుడు జగదీశ్ రెడ్డి అంటూ నిప్పులు చెరిగారు. అసలు జగదీశ్ రెడ్డి గురించి మాట్లాడటమే పెద్ద వెస్ట్ అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 80 ఎకరాల ఫామ్ హౌస్ ను జగదీశ్ రెడ్డది ఎలా కట్టాడని ప్రశ్నించారు. అలాగే సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం చుట్టూ 150 ఎకరాల భూములు జగదీశ్ రెడ్డికి ఎలా వచ్చాయని నిలదీశారు.
తెలంగాణ ఉద్యమంలో దళితుణ్ణి సీఎం చేస్తామంటూ చెప్పిన కేసీఆర్ ఏం చేశారని నిలదీశారు. దళితుణ్ని సీఎం చేయకుంటే మెడ మీద తల నరుక్కుంటానన్నారని గుర్తు చేశారు. మరి తొమ్మిదేండ్లు తల నరుక్కున్నాడా..? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ దోపిడీ వల్ల తాము ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయలేకపోయామని వివరణ ఇచ్చారు.
తమ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. 200 యూనిట్ల కరెంట్..100 రోజుల్లో ఇచ్చి తమ హామీ నిలబెట్టుకుంటామని అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి ఆ హామీని కేసీఆర్ నెరవేర్చలేదన్నారు.. నిరుద్యోగులను బీఆర్ఎస్ మోసం చేసిందన్నారు.. పదేళ్లు వారికి ఉద్యోగాలు ఇవ్వకూండా తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు నిరుద్యోగులను కేసీఆర్ ఇంటికి పంపాలా.. కేటీఆర్ ఇంటికి పంపాలా? అని ప్రశ్నించారు.