విపక్ష ఇండియా (India) కూటమిలో విభేదాలు హాట్ హాట్ గా కొనసాగుతున్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో భాజపా సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో కూటమిలోని పార్టీలు కొన్ని విషయాల్లో సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
మరోవైపు కాంగ్రెస్ (Congress) సార్వత్రిక ఎన్నికల ముసాయిదా మేనిఫెస్టో.. ఫిబ్రవరి 15 నాటికి ప్రకటిస్తుందని థరూర్ వెల్లడించారు. ఇండియా కూటమిలోని అన్ని పార్టీల మేనిఫెస్టోలను పరిగణనలోకి తీసుకొని.. కీలక అంశాలతో రూపొందిస్తామన్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదలకు ఆర్థిక సాయం, మహిళల హక్కులు, యువత, రైతాంగంపై ప్రధానంగా దృష్టి సారిస్తామని వెల్లడించారు.
ప్రజా సమస్యల పరిష్కారమే మా ప్రధాన అజెండాగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. అయితే త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల సమరానికి కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా కీలకమైన మేనిఫెస్టోని (Manifesto) రూపొందించడానికి ఇప్పటికే ఓ కమిటీ వేసింది. కాగా విపక్ష కూటమి వరుస షాకులతో ఇబ్బంది పడుతోన్న విషయం తెలిసిందే..
తాజాగా బీహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ సైతం గుడ్‌బై చెప్పారు.. ఇప్పటికే బలహీనం అవుతోన్న ఈ కూటమి, బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటుందా అనే అనుమానాలు చోటు చేసుకొంటున్న నేపథ్యంలో థరూర్ వ్యాఖ్యలు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి..