Telugu News » Rajya Sabha Elections : పెద్దలు ఎవరు..? రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Rajya Sabha Elections : పెద్దలు ఎవరు..? రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో బీఆర్ఎస్ రాజ్య సభ ఎంపీలు జోగినపల్లి సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్రల పదవవీ కాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది.

by Venu

– దేశవ్యాప్తంగా 56 స్థానాలు
– తెలంగాణలో 3, ఆంధ్రాలో 3 ఖాళీ
– 8న నోటిఫికేషన్‌.. 27న పోలింగ్
– తెలంగాణలో కాంగ్రెస్ కు 2
– బీఆర్ఎస్ కు ఒకటి దక్కే ఛాన్స్
– హస్తం పార్టీలో ఆరుగురి దాకా ఆశావహులు
– బీఆర్ఎస్ నుంచి కవితకు ఛాన్స్!
– మూడోస్థానంపైనా కాంగ్రెస్ దృష్టి
– గులాబీ ఎమ్మెల్యేలతో రేవంత్ చర్చలు ఇందుకేనా?

లోక్‌ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశంలో మరో ఎన్నికల సమరానికి నగారా మోగింది. రాజ్యసభలో ఏప్రిల్‌ లో ఖాళీ అయ్యే 56 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్‌ జారీ చేస్తామని తెలిపింది. వచ్చే నెల 27న రాజ్యసభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది.

దేశవ్యాప్తంగా 56 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో తెలంగాణ నుంచి మూడు, ఆంధ్రా నుంచి మూడు స్థానాలున్నాయి. నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ ఫిబ్రవరి 15గా నిర్ణయించిన ఎన్నికల సంఘం.. 16న నామినేషన్ల పరిశీలన, 20న ఉపసంహరణకు చివరి తేదీగా పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ లో సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల పదవీ కాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగుస్తోంది. అలాగే, తెలంగాణలో బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు జోగినపల్లి సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్రల పదవవీ కాలం కూడా అదే తేదీతో ముగియనుంది.

రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన నేపథ్యంలో ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం చూస్తే కాంగ్రెస్ కు 2, బీఆర్ఎస్ ఒక స్థానం దక్కే ఛాన్స్ ఉంది. ఆ ఒక్క స్థానాన్ని కవిత కోసం కేసీఆర్ రిజర్వ్ చేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే.. కాంగ్రెస్ ఆ ఒక్క సీటును కూడా బీఆర్ఎస్ కు దక్కకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

ఈ మధ్య వరుసగా గులాబీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. మంత్రులేమో బీఆర్ఎస్ ను ఖాళీ చేస్తామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే గులాబీ పార్టీకి వస్తుందనుకున్న ఒక్క రాజ్యసభ సీటు కూడా గల్లంతు ఖావడం ఖాయం. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో ఈ అంశంపై చర్చించినట్టుగా రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చూడాలి, ఎన్నికల నాటికి ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో.

You may also like

Leave a Comment