ఢిల్లీతో పాటు జార్ఖండ్ రాజధాని రాంచీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మనీలాండరింగ్ కేసు (Money Laundering Case)లో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren)ను ప్రశ్నించాలని ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు సోమవారం నుంచి సీఎం హేమంత్ సోరెన్ కనిపించడం లేదంటూ అధికారులు చెబుతున్నారు.
కానీ సీఎం సురక్షితంగా ఉన్నారంటూ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం తమతో టచ్‌లోనే ఉన్నారంటూ పేర్కొంటున్నాయి. మరోవైపు ఢిల్లీలో సీఎం హేమంత్ సోరెన్ ను ప్రశ్నించేందుకు ఆయన నివాసానికి ఈడీ అధికారులు వెళ్లారు. కానీ అక్కడ సోరెన్ లేకపోవడంతో అధికారులు ఆయన నివాసంలో తనిఖీలు నిర్వహించారు.
అనంతరం సీఎం హేమంత్ సోరెన్‌కు చెందిన బీఎండబ్ల్యూ కారుతో పాటు కొన్ని పత్రాలను ఈడీ అధికారులు సీజ్ చేశారు. సీఎం సోరెన్ ఎక్కడ ఉన్నారనే విషయం తమకు తెలియదన్నారు. రాంచీ నుంచి ఢిల్లీకి చార్టెడ్ ఫ్లైట్ ఆయన ప్రయాణించారని తెలుస్తోందని పేర్కొన్నారు. ఆ ఫ్లైట్ విమానాశ్రయంలో పార్క్ చేసి ఉందని వివరించారు.
సీఎంతో పాటు ఆయన సిబ్బంది ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయని తెలిపారు. ఆయన కారు డ్రైవర్ ను కూడా ప్రశ్నించామని, కానీ తనకు కూడా తెలియదని డ్రైవర్ సమాధానం ఇచ్చారన్నారు. ఇదిలా ఉండగా, రేపు మధ్యాహ్నం 1 గంటలకు ఆయన విచారణకు అందుబాటులో ఉంటారని సీఎం కార్యాలయం నుంచి ఈడీకి లేఖ అందింది. ఈ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని గవర్నర్ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.
ఇది ఇలా వుంటే హేమంత్ సోరెన్ స్థానంలో ఆయన సతీమణి కల్పనా సోరెన్ సీఎం పదవి చేపడుతారని వార్తలు వినిపిస్తున్నాయి. జేఎంఎం ఎమ్మెల్యేలంతా రాంచీకి చేరుకోవాలని ఆ పార్టీ ఆదేశాలు జారీ చేసిందని, ఈ పరిస్థితులు చూస్తుంటే కల్పనా సోరెన్‌ను సీఎంగా నియమించే అవకాశం ఉన్నట్టు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ట్వీట్ చేశారు.