– ఎట్టకేలకు ఏసీబీ కస్టడీకి అవినీతి అనకొండ
– 8 రోజులకు పర్మిషన్ ఇచ్చిన కోర్టు
– శివ బాలకృష్ణ నోరు విప్పితే ఏం జరుగుతుంది..?
– బడా నేతల పేర్లు బయటకొస్తాయా?
– అవినీతి అధికారుల గుట్టంతా బట్టబయలవుతుందా?
– ఇంతకీ, ఎవరికి బినామీగా ఉన్నారు..?
– ఈయనకున్న బినామీలు ఎవరు..?
అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండీఏ (HMDA) మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ (Siva Balakrishna) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు ఏసీబీ (ACB) కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. అధికారులు శివ బాలకృష్ణను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కొద్దిరోజుల క్రితం పిటిషన్ వేశారు. విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారని.. ఆయన్ను విచారిస్తే కీలక విషయాలన్నో బయటకొస్తాయని అందులో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. 8 రోజుల కస్టడీకి పర్మిషన్ ఇచ్చింది. దీంతో బాలకృష్ణతో పరిచయాలున్న నేతలు, అధికారుల్లో టెన్షన్ మొదలైంది. కస్టడీలో ఆయన ఏం చెప్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సోదాల్లో బయటపడ్డ ఖజానా
1994లో గ్రూప్-1 క్యాడర్ తో సర్వీస్ లోకి వచ్చారు శివ బాలకృష్ణ. అనంతపురం, గుంటూరు, వైజాగ్, జీహెచ్ఎంసీ, మున్సిపల్ శాఖల్లో కీలక పదవులు చేపట్టారు. 2021 నుండి 2023 వరకు హెచ్‌ఎండీఏ డైరెక్టర్ గా విధులు నిర్వహించారు. ఆ సమయంలో అనేక అక్రమాలకు పాల్పడినట్టు చాలా ఫిర్యాదులు ఏసీబీకి అందాయి. దీంతో కొన్నాళ్లుగా ఆయనపై నిఘా పెట్టి.. కీలక సమాచారం సేకరించాక తనిఖీలు జరిపారు అధికారులు. ఈ సోదాల్లో 50 ప్రాపర్టీ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. 4.9కోట్లు స్థిరాస్తులు, 8.2 కోట్ల చరాస్తులతో పాటు కోట్ల విలువైన పత్రాలు, వస్తువులను గుర్తించారు. పుప్పాలగూడ ఆదిత్య ఫోర్ట్ వ్యూలో విల్లా హౌజ్, సోమాజిగూడ లెజెండ్ తులిప్స్ లో ఫ్లాట్, శేరిలింగంపల్లిలో అధితలో ఫ్లాట్, మల్కాజిగిరి, చేవెళ్లలో ప్లాట్స్ ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
దర్జాగా అక్రమ అనుమతులు!
బీఆర్ఎస్ సర్కార్ లో హెచ్‌ఎండీఏలో అన్నీ తానై అన్నట్లుగా వ్యవహరించారు శివ బాలకృష్ణ. ఈయన చాలా మంది ప్రముఖ నేతలకు బినామీగా ఉండడమే కాకుండా.. తనకూ బినామీలను ఏర్పాటు చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధరణిని అడ్డం పెట్టుకుని అడ్డగోలు వ్యవహారాలు చేశారని.. భూముల్ని ఇష్టం వచ్చినట్లుగా సొంతానికి రాసుకోవడం.. రాజకీయ నేతలకు కావాల్సినట్లుగా చేయడం వంటివి చేశారన్న విమర్శలు అరెస్ట్ తర్వాత బలంగా రీసౌండ్ ఇస్తున్నాయి. లంచాలు, భూములతో అక్రమంగా సంపాదించిన బాలకృష్ణ.. హెచ్ఎండీఏలో ఉన్న సమయంలో చాలామంది నాయకులు, అధికారులకు అనుకూలంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఆయన చేతులమీదుగా జరిగిన అక్రమ అనుమతులు ఎన్ని ఉన్నాయో అనే చర్చ జోరుగా సాగుతోంది.
కిందిస్థాయి అధికారులతో కలిసి అవినీతి..!
శివ బాలకృష్ణ అరెస్ట్ తర్వాత ఆయన లింక్స్ పై ఆరా తీసిన ఏసీబీకి కీలక విషయాలు తెలిసినట్టు సమాచారం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ లో పని చేస్తున్న అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ శివ బాలకృష్ణకు బినామీలుగా ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. శివ బాలకృష్ణ నివాసంలో తనిఖీలు ప్రారంభం కాగానే సదరు ఉద్యోగులు తమ నివాసాల్లోని కీలకమైన దస్త్రాలతో మాయమైనట్టు ప్రచారం జరుగుతోంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ లో భూ బదలాయింపుల విభాగం చాలా కీలకమైంది. హెచ్ఎండీఏ నుంచి ఎంఏయూడీకి వచ్చే భూ బదలాయింపుల దస్త్రాలన్నీ ఇక్కడి నుంచే వెళ్తుంటాయి. రెండేళ్లుగా హెచ్ఎండీఏ నుంచి వచ్చే భూ బదలాయింపు పత్రాలు తొలుత శివ బాలకృష్ణకు నేరుగా వెళ్లాయనే ఆరోపణలున్నాయి. సదరు సెక్షన్ ఆఫీసర్ నుంచి వచ్చే దస్త్రాలే పరిష్కారానికి నోచుకునేవని ఏసీబీ విచారణలో బయటపడినట్టు సమాచారం. ఇప్పుడు కస్టడీలో ఆయన్ను ఈ విషయాలపై ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. అధికారులు ఆధారాలతో అన్నింటిపై నిలదీస్తే.. జరిగింది చెప్పక తప్పదు. అదే జరిగితే.. శివ బాలకృష్ణ ఎవరి కనుసన్నల్లో పని చేశారు..? ఎవరికి లబ్ధి చేకూర్చారు..? ఆయనెంత వెనకేసుకున్నారు..? ఇలా చాలా విషయాలు బయటపడే అవకాశం ఉంది.