నేడు కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (KRMB) హైదరాబాదు (Hyderabad)లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ENC)లు హాజరయ్యారు. ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ (Central Water Resources Department) కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కొనసాగింపుగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ శివనందన్ కుమార్ తో ఈ భేటీ జరిగింది.
ఈ క్రమంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు అంగీకరించారు. ఈ సమావేశం అనంతరం ఏపీ (AP) ఈఎన్సీ నారాయణరెడ్డి స్పందిస్తూ… కేఆర్ఎంబీకి శ్రీశైలం (Srisailam), సాగర్ ( Sagar) నిర్వహణ అప్పగింతకు అంగీకరించామని.. ఏపీలో 9, తెలంగాణ (Telangana)లో 6 కాంపోనెంట్స్ అప్పగింతకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా నీటి వాటాల కేటాయింపుపై త్రిసభ్య కమిటీదే తుది నిర్ణయం అని పేర్కొన్నారు. మరోవైపు ఈ అంశంపై తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ రావు స్పందిస్తూ.. కృష్ణా జలాల్లో 50 శాతం వాటా డిమాండ్ కు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. నీటి వాటాలపై మాత్రమే నిర్ణయాలు ఉంటాయని.. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే చర్చించేందుకు ఢిల్లీ వేదిక ఉందని తెలిపారు. నీటి నిర్వహణ అవుట్ లెట్స్ ను బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు.
తెలంగాణ జల విద్యుత్ కేంద్రాల నిర్వహణపై నేటి సమావేశంలో చర్చ జరగలేదని తెలిపిన ఈఎన్సీ మురళీధర్ రావు.. నీటి విడుదల అంశాన్ని త్రిసభ్య కమిటీకి అప్పగించామని తెలిపారు.. ఇదిలా ఉండగా సాగర్ నిర్వహణపై ఏపీ, తెలంగాణ మధ్య నవంబర్ 30న వివాదం తలెత్తిన విషయం తెలిసిందే.. దీంతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి డిసెంబర్లో రెండు రాష్ట్రాల సీఎస్‌లు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. వివాదానికి తెరదించాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శికి సూచించారు.