భారత్(Bharath)లో వేసవిలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అందరికీ తెలిసిందే. మండే ఎండలతో బయటకు వెళ్లలేని పరిస్థతులు ఉంటాయి. అయితే, ప్రతీ ఏడాది లాగే ఈసారి కూడా వేసవి కాలం ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ది ప్రొవిజినల్ స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమెట్(The Provisional State of the Global Climate) నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఎల్‌నినో(El Nino) ప్రభావంతో ఈ ఏడాది ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ(IMD) తెలిపింది.
గ్రీన్‌హౌస్ వాయువుల వల్ల ఈ వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నదని తెలిపింది. పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా సముద్రమట్టాలు పెరుగుతాయని వెల్లడించింది. ఫిబ్రవరి చివరి వారం నుంచే ఎండలు మండిపోతాయని, మార్చి 20 తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు తెలిపారు.
వాతావరణ మార్పుల వల్లే సాధారణ ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. మార్చి నెలలో ఎండలు తీవ్రరూపం దాల్చనున్నాయి. ఇప్పటికే మధ్యాహ్నం వేళలో ఉక్కపోత వాతావరణంతో ప్రజలు సతమతమవుతున్నారు. ఈ వేసవిలో ఎండలతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉన్నందున మధ్యాహ్నం వేళలో ఇంటిపట్టునే ఉంటే మంచిదని చెబుతున్నారు.