రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతీ గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యంగా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ గ్రామాలను అద్దం పట్టేలా చేయాలని పిలుపునిచ్చారు.
యువత, మహిళలు, ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం చివరి రోజున గ్రామసభ నిర్వహించి పారిశుధ్య కార్మికులను సన్మానించాలని మంత్రి సీతక్క సూచించారు. సర్పంచ్‌ల పదవీ కాలం ముగియడం, గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కావడంతో గ్రామ పంచాయతీల పాలనపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ములుగు కలెక్టరేట్ నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈసందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో రోడ్లను శుభ్రం చేయడంతోపాటు పిచ్చిమొక్కలను తొలగించాలన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రం చేయాలని సూచించారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించే వరకూ ప్రత్యేక అధికారులతో పాలన సాగించాలని నిర్ణయించామన్నారు.
అదేవిధంగా మేడారం జాతరలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. అదే సమయంలో జాతరకు ప్లాస్టిక్ తీసుకురాకుండా భక్తులకు అవగాహన కల్పించాలని, రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నిర్వహించే జాతరలో తగు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.
రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామాల ప్రత్యేక అధికారులు తాగునీటి సరఫరాపై దృష్టి సారించాలని సీతక్క అన్నారు. తాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని, ఈ మేరకు రూ. కోటి నిధులు కేటాయించామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.