ఎంపీ, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి(Vemireddy Prabhakar Reddy) అసంతృప్తిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Minister Peddireddy Ramachandra Reddy) స్పందించారు. ఎన్నికల సమయంలో అసంతృప్తి సహజంగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సరైన పనితీరు కనపరచని వారికి పార్టీ టికెట్ నిరాకరించిందన్నారు.
నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అధిష్టానం ప్రకటించింది. తన పరిధిలో వచ్చే మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులను మార్చాలని ఆయన ముందునుంచి పట్టుబడుతున్నారు. దీనిపై అధిష్ఠానం స్పందించకపోవడంతో అసంతృప్తితో ఉంటున్నారు. తనకు పార్టీలో జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారే కానీ ఆ గౌరవం దక్కడం లేదని వేమిరెడ్డి తన అనుచరుల ఎదుట వాపోయినట్లు సమాచారం.
వేమిరెడ్డి శనివారం మధ్యాహ్నం ఉన్నట్టుండి నెల్లూరు నుంచి ఆయన పయనమయ్యారు. కొద్దిరోజుల పాటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అనుచరులకు, సిబ్బందికి సూచనలిచ్చారని తెలుస్తోంది. మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చనిపోయిందని, ఆ పార్టీ దహన సంస్కారాలకు వైఎస్ షర్మిలను తీసుకొచ్చారంటూ సెటైర్లు విసిరారు.
అదేవిధంగా ‘‘షర్మిల, కేవీపీ, ఘువీరా రెడ్డి, గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ పాడే మోస్తున్నారు. పార్టీలో అసంతృప్తితో ఉండటం సాధారణమే. పార్టీ గెలిచే వారికే టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉంటుంది’’ అంటూ పెద్దిరెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా జగన్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.