హైదరాబాద్ (Hyderabad) నగరం మాదక ద్రవ్యాలకు అడ్డాగా మారుతుందనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్న నేపథ్యంలో.. అందుకు అనుగుణంగా ఇక్కడ భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడటం కనిపిస్తోంది. ఇప్పటికే వీటిపై ఉక్కుపాదం మోపిన ప్రభుత్వం.. ఆ దిశగా చర్యలు గట్టిగానే చేపట్టింది. అయిన స్మగ్లర్లు ఎలాంటి భయం లేకుండా యధేచ్చగా చీకటి దందా కొనసాగించడానికి ముందుకు వెళ్ళడం ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పటికే నగరంలో మాదక ద్రవ్యాల ముఠాలను తరచుగా పోలీసులు పట్టుకోవడం కామన్ గా మారింది. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో భారీగా మత్తు పదార్థాలను తరలిస్తున్న మరో ముఠా పట్టుబడింది. అరకిలో కొకైన్, అరకిలో హెరాయిన్‌ను తరలిస్తున్న ముఠా.. పంజాగుట్ట (Panjagutta)లో, నార్కోటిక్ బ్యూరో అధికారులకు చిక్కింది. వీటితో పాటు పెద్ద మొత్తంలో ఎల్‌ఎస్‌డీ (LSD), ఎండీఎఏ (MDAA)ను సైతం నార్కోటిక్ బ్యూరో స్వాధీనం చేసుకొందని సమాచారం.
మరోవైపు విదేశాల నుంచి మత్తు పదార్థాలను తెచ్చిన నైజీరియన్ (Nigerian) గ్యాంగ్ వీటిని హైదరాబాదులో అమ్ముతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందు కోసం వీరు నగరంలో గ్యాంగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే పట్టుబడిన వారిలో అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ ఉన్నట్లు సమాచారం. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలుస్తోంది. కాగా పోలీసులకు చిక్కిన సదరు నైజీరియన్, మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ ఫెడ్లర్‌గా అధికారులు గుర్తించారు.